కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు! హరీష్‌ రావు, ఈటలకు కూడా..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కమిషన్ విచారణలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల జూన్ 9న విచారణకు హాజరు కావాల్సి ఉంది.

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు! హరీష్‌ రావు, ఈటలకు కూడా..
KCR Kaleshwaram

Updated on: May 20, 2025 | 3:15 PM

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు(కేసీఆర్‌)కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు, ప్రస్తుత బీజేపీ నేత, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. జూన్‌ 5న విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. అలాగే జూన్‌ 6న హరీష్‌ రావు, 9న ఈటల విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించింది. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.

కాళేశ్వరం నిర్మాణం సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారికి కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్‌. నిజానికి ఈ నెలాఖరుకే పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ, విచారణకు మరికొంత సమయం అవసరం అని భావించి గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం కమిషన్‌ గడువు పొడిగించగా.. ఈ రోజు కేసీఆర్‌కు నోటీసులు ఇష్యూ అయ్యాయి. కమిషన్ గడువు ఇంకో 2 నెలలు అంటే జులై 31 వరకూ పొడిగించారు.

నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా దీనిపై జీవో కూడా ఇచ్చారు. నాడు మంత్రులుగా ఉన్న వారిని కూడా విచారించి అప్పుడు ఏం జరిగిందో పూర్తి అంచనాకు వచ్చాక నివేదిక ఫైనల్‌ చేయాలని భావించిన కమిషన్‌ కేసీఆర్‌తో పాటు హరీష్‌ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకూ అధికారులు, నిపుణులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను మాత్రమే కమిషన్‌ విచారించింది. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నుంచే కాళేశ్వరంపై వివరణ తీసుకోవడానికి విచారణకు పిలిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..