పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పుడు ఉన్న సిట్టుంగు స్థానాలతో పాటు.. మరికొన్ని స్థానాలను దక్కించుకునేందుకు అధిష్టానం ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తోంది. ముఖ్యంగా 17 స్థానాల్లో సగానిపైగా స్థానాలను దక్కించుకునేందుకు రాష్ట్ర కాషాయపార్టీ నేతలు కూడా కిందిస్థాయి బలగాన్ని సంసిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ తనదంటే తనదంటూ ముగ్గురు కీలక నేతలు పోటీపడుతున్నారు. ఇద్దరైతే డైరెక్ట్‌గా బహిరంగ ఫైట్ చేస్తుంటే, మరొకరు మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు. మహబూబ్‌నగర్ టికెట్ కోసం జరుగుతోన్న ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలోనే కాక.. రాష్ట్ర స్థాయిలో కాకరేపుతోంది.
పాలమూరు టికెట్ తనదే అంటున్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి. వాళ్లు రాజకీయాల్లో సీనియర్లు కావొచ్చు.. బీజేపీలో మాత్రం తానే సీనియర్ అంటున్నారు టీబీజేపీ కోశాధికారి శాంతికుమార్. గతంలో రెండుసార్లు త్యాగంచేశా, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
మహబూబ్‌నగర్ నా గడ్డ, నా అడ్డా అంటూ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఆశీర్వాదం తనకే ఉందని.. తానే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తానంటూ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
అయితే, శాంతికుమార్ కూడా తనకే టికెట్ దక్కుతుందంటూ పేర్కొన్నారు. ఈసారి బీసీకే టికెట్, అది నాకే దక్కుతుందంటూ టీబీజేపీ కోశాధికారి శాంతికుమార్
తెలిపారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. పైకి డైరెక్ట్‌గా చెప్పకపోయినా సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఈమధ్య కాంగ్రెస్‌పై అగ్రెసివ్‌గా వెళ్తూ పాలమూరు టికెట్ రేస్‌లో తాను ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు డీకే అరుణ.
మరి, ఈ ముగ్గురిలో టికెట్ దక్కేదెవరికో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది? ఇప్పటికే అధిష్టానం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్నట్లు సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..