Video: ప్రాణం తీసిన ఐపీఎల్ మ్యాచ్.. ఫోన్‌లో చూస్తూ డ్రైవింగ్.. అంతలోనే ఊహించని ఘోరం..

ఐపీఎల్ ఫైనల్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆ మ్యాచ్ చూస్తూ చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు.. ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆ కుటుంబంలో ఎప్పటికీ తీరని గుండెకోత మిగిల్చింది. జగిత్యాల జిల్లాలో ఫోన్‌లో మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల థార్ వాహనం నేరుగా బావిలోకి దూసుకెళ్లింది.

Video: ప్రాణం తీసిన ఐపీఎల్ మ్యాచ్.. ఫోన్‌లో చూస్తూ డ్రైవింగ్.. అంతలోనే ఊహించని ఘోరం..
Youth Dies After Thar Falls Into Well

Updated on: Jun 01, 2026 | 12:16 PM

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మొబైల్ ఫోన్‌లో మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. తెలంగాణలో చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామ శివారులో ఈ దారుణం జరిగింది. నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మొబైల్ ఫోన్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వస్తోంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న అరుణ్ రోడ్డుపై దృష్టి పెట్టకుండా, మొబైల్‌లో మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. ఆ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా దూసుకెళ్లిన థార్ వాహనం రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి పల్టీ కొట్టింది.

ఒకరు మృతి.. ఇద్దరు ప్రాణాలతో..

ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన అరుణ్ అనే యువకుడు బావిలో మునిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లోపల ఉన్న మిగతా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలైనా అద్దాలు పగలగొట్టుకుని చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అరుణ్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో టైమ్‌కు అది రాక బయటకు రాలేకపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు శ్రమించి బావిలో నుంచి అరుణ్ మృతదేహాన్ని, థార్ వాహనాన్ని బయటకు తీశారు.

వీడియో చూడండి..

హైదరాబాద్, కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ..

మరోవైపు ఐపీఎల్ ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే ఈ సంబరాలు కాస్తా అర్ధరాత్రి తీవ్ర గందరగోళానికి దారితీశాయి. హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ సంఖ్యలో ఆర్సీబీ మద్దతుదారులు రోడ్లపైకి చేరారు. కేకలు వేస్తూ, బైక్ ర్యాలీలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుండటంతో గొడవను అదుపు చేయడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అటు ఏపీలోని కర్నూలులో కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపై ట్రాఫిక్‌ను స్తంభింపజేయడమే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. కొందరు ఆవేశపరులైన యువకులు రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.

Follow Us