Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్ -3కి సంబంధించి సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు నీటి లీకేజీలు నివారించేందుకు గానూ శంకర్ పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. ఈ కారణంగా 01.06.2022, బుధవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 02.06.2022, గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ 24 గంటల వరకు ఖానాపూర్ కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
నీటి సరఫరా కు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..
ఓ ఆండ్ ఎం డివిజన్ – 3, 15, 18 పరిధిలోని గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్ పల్లి, గుల్మొహర్ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.