రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్..!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించే దిశగా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. సిమెంట్ బస్తాను రూ.220కు అందించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై కంపెనీలు స్పందించగా, త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయంలో వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్..!
Indiramma Housing Scheme

Edited By:

Updated on: Jul 16, 2026 | 8:21 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ధరలు, సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర సుమారు రూ.330 వరకు ఉండగా, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్కో బస్తాను రూ.220కే అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా బల్క్ ఆర్డర్ ఇచ్చే నేపథ్యంలో ఒకే ధరకు సరఫరా చేయాలని కోరింది. అయితే ఆ ధరకు సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని కంపెనీలు పేర్కొంటూ, ఒక్కో బస్తాను రూ.270 వరకు అందించేందుకు సిద్ధమని తెలిపాయి.

ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 180 సిమెంట్ బస్తాలు, 15 క్వింటాళ్ల స్టీల్ అవసరం అవుతుంది. అందుకే నిర్మాణ సామగ్రి ధరల్లో స్వల్ప తగ్గింపే వచ్చినా లబ్ధిదారులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ధరలు ఖరారైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానంలో సరఫరా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా సిమెంట్, స్టీల్‌ను నేరుగా అందించాలని ప్రభుత్వం కంపెనీలకు సూచించింది. ఒక్కో సిమెంట్ బస్తాపై రూ.10 తగ్గినా ఇంటి నిర్మాణ వ్యయంలో దాదాపు రూ.1,800 వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. అదే మార్కెట్ ధరతో పోలిస్తే రూ.220 లేదా రూ.230కు సిమెంట్ లభిస్తే ఒక్కో ఇంటిపై సుమారు రూ.18 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సిమెంట్‌తో పాటు స్టీల్ ధరలను కూడా తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఒక్కో ఇంటికి 15 క్వింటాళ్ల స్టీల్ అవసరం కావడంతో బల్క్ కొనుగోలు ద్వారా రాయితీ ధరలకు సరఫరా చేసే అంశంపై ఉక్కు కంపెనీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. త్వరలో తుది విడత చర్చలు నిర్వహించి ధరలు, సరఫరా విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us