తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. 4 వందల చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం.. 4 ఏళ్లలో 20 లక్షల మంజూరు లక్ష్యంగా ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దీపావళి కానుకగా తొలివిడత ప్రతీ నియోజకవర్గంలో 3వేల 5 వందల ఇళ్లు కేటాయిస్తామని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 20 కల్లా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తూ 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా గ్రామ కమిటీల ద్వారా పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందన్నారు. అందుకోసం ఒక యాప్‌ను డిజైన్ చేశామన్నారు. లబ్దిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్ దే కీలకపాత్ర అన్నారు మంత్రి పొంగులేటి. ఆధార్‌తో సహా అన్నివివరాలు యాప్ లో పొందుపరుస్తారని వివరించారు.
నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు. నాలుగు దశల్లో ఫౌండేషన్ కి లక్ష, రెండో దశలో 1.25 లక్షలు, మూడో దశలో స్లాబ్ కి 1.75, చివర దశల్లో లక్ష.. టోటల్‌గా 5లక్షలు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు. మొదటి దశలో ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం, రెండో దశలో లబ్దిదారులకు ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదనపు నిర్మాణం అవసరం అనుకుంటే యజమాని తన సొంత ఖర్చుతో నిర్మించుకోవచ్చన్నారు.ఇంటి యజమాని హక్కు మహిళల పేరిట ఉంటుందన్నారు. 16 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమీకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తొలివిడతా దాదాపు 28 వేలు కోట్ల ఖర్చు కావచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్ట్ కోసం బడ్జెట్‌లో 7వేల 740 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా అవసరమైన నిధులను సమీకరిస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తమ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోవడంలేదన్నారు. కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటాం, ఏమీ ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం.. పేదవాళ్ల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అన్నారు మంత్రి
డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సంక్రాంతి కల్లా సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ ల ఎన్నిక పూర్తి అవుతుందన్నారు. ఇక వచ్చే ఏడాది తెలంగాణలో సీఎం మారుతారన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిపై కామెంట్ స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
వచ్చే నాలుగేళ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని మంత్రి చెప్పారు. 4 ఏళ్ల తరువాత మళ్లీ కాంగ్రెసే గెలుస్తుంది.. అప్పుడు సీఎం ఎవరో ఏఐసీసీ నిర్ణయిస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..