Rain Alert: బాబోయ్‌ ఇప్పట్లో వదిలేలాలేవుగా.. మరో రెండు రోజులు వానలే వానలు..! అల్లాడిపోతున్న రైతులు

|

Nov 01, 2024 | 8:12 AM

నిన్న మొన్నటి వరకు వరుస వానలతో జన జీవనాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు.. మళ్లీ విరుచుకు పడుతున్నాడు. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు..

Rain Alert: బాబోయ్‌ ఇప్పట్లో వదిలేలాలేవుగా.. మరో రెండు రోజులు వానలే వానలు..! అల్లాడిపోతున్న రైతులు
Rain Alert
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 1: తెలంగాణకు వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

శుక్రవారం రోజున ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొమురంభీం, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నవంబర్‌ 4 వరకు రాష్ట్రంలో వానలు కొనసాగేందుకు అవకాశాలున్నాయని వివరించింది. నిన్న గురువారం కూడా పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ యార్డు, రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం వానకు తడిసిపోయింది. మరి కొందరి రైతులు ధాన్యం వానలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడిన పంట కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతుల దుఃఖం ఆసుకోలేక బావురుమన్నారు. వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందిపడ్డారు.

ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే చలి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. అక్టోబర్‌ నెలాఖరు నుంచే చలి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ ఏడాది హైదరాబాద్‌లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య మాత్రమే ఉంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.