Telangana Rain Alert: తెలంగాణలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. అల్పపీడనం ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించినట్లు తెలిపారు. తెలంగాణలో ఆదివారం, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. వర్షం సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
కాగా.. అల్పపీడనం ప్రభావంతో శనివారం ఉదయం 8 నుంచి రాత్రి వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, పాత మంచిర్యాలలో 9.2 సెంటిమీర్లు, కుమ్రంభీం జిల్లా వంకులంలో 7.3, కరీంనగర్ అర్నకొండలో 6.1, ఖమ్మం కారేపల్లిలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో అన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది. ఆదివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..