తెలంగాణలో గత కొద్ది రోజులుగా విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుండగా.. మరికొన్ని చోట్ల వర్షాటు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్‌లో కూడా రెండ్రోజులకు ఓ సారైనా వాన దంచుతోంది . తాజాగా తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మే 25 శనివారం… ఉమ్మడి ఖమ్మం,వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు.
శుక్రవారం (మే 24) తెలంగాణలో అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. శనివారం కూడా తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప.. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…