అర్థరాత్రి 3 గంటలు.. పోలీసులను చూసి లైట్లు ఆఫ్ చేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ హరీష్ మృతి చెందాడు. తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ లైట్లు ఆఫ్ చేసి పొలాల మార్గంలో పారిపోవడానికి యత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా, టైర్ కింద పడి హరీష్ అక్కడికక్కడే చనిపోయాడు.

అర్థరాత్రి 3 గంటలు.. పోలీసులను చూసి లైట్లు ఆఫ్ చేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Llegal Sand Transport

Edited By:

Updated on: May 18, 2026 | 7:00 PM

కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ డ్రైవర్ మృతి చెందాడు. కరీంనగర్ సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గున్నాల హరీష్ అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ద్వారా తరలిస్తూ వస్తున్నాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో దుర్షేడ్ గ్రామ శివారులో రూరల్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇసుకతో వస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ హరీష్ ట్రాక్టర్‌ను వేగంగా రివర్స్ తీసుకుని అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం ట్రాక్టర్ లైట్లు ఆఫ్ చేసి గ్రామం వైపు పొలాల మార్గంలో వెళ్లాడు.

అయితే, చీకట్లో పొలంలో ఉన్న పెద్ద రాయి ట్రాక్టర్‌కు అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో హరీష్ ట్రాక్టర్ పై నుంచి కిందపడిపోయాడు.. ఈ క్రమంలో టైర్ కింద పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పొలంలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుతోనే హరీష్ చనిపోయాడని. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల చౌరస్తా వద్ద మృతుల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకి ఆందోళనకారులకి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us