
వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఇకపై వంట గ్యాస్ అందుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సిందే. లేకపోతే గ్యాస్ సిలిండర్ అందుకోవడంలో అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీలు కట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్‌కు అందించే రాయితీ, తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.500 సబ్సిడీ డబ్బులు కూడా నిలిచిపోతాయి. వీటితో పాటు సాధారణ వినియోగదారులు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎప్పటినుంచో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. జనవరి 31 వరకు గడువు పొడిగించారు. దీంతో వంటగ్యాస్ సిలిండర్ వినియోగదారులందరూ ఆ డెడ్ లైన్ లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.
మీకు గ్యాస్ అందించడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది. అందులో మీ బయోమెట్రిక్ వివరాలు ఇచ్చే సరిపోతుంది. లేదా మీరు ఎక్కడైనా గ్యాస్ తీసుకున్నారో ఈ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి చేసుకోవచ్చు. లేదా గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే www.pmuy.gov.in/e-kyc.html లేదా ఆయిల్ ఇండస్ట్రీ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో ఇందుకు ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో జనవరి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంకా చేసుకోనివారు ఉంటే వెంటనే చేసుకోవడం మంచిది. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నిలిచిపోవడం వల్ల నష్టపోవాల్సి ఉంటుంది.
ఆధార్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ ప్రాసెస్ ద్వారా గ్యాస్ వినియోగదారులు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి మదన్ మోహన్ రావు తెలిపారు. కేంద్ర ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన గడువు ముగిసిందని, ఇప్పుడు జనవరి 31 వరకు మాత్రమే అందుకు డెడ్ లైన్ ఉందని తెలిపారు. నాణ్యతలేని స్థానిక రబ్బర్ ట్యూబులను వాడటం వల్లనే గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ఐఎస్ఐ ముద్ర ఉన్న ట్యూబులను మత్రమే వాడాలని సూచించారు.