Rs 5 Note: దేశంలో రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. అమాయకులను అసరా చేసుకుంటున్న కేటుగాళ్లు నిలువునా మోసగిస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులు వేస్తూ నిండా ముంచుతున్నారు. తాజాగా పాత రూ.5 నోటు ఉంటే లక్షలు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని నిలువునా దోపిడి చేశారు. వివరాల్లోకి వెళితే… తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నర్సింలుకు ఈ నెల 1న ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాతకాలం నాటి ఐదు రూపాయల నోటు ఉంటే రూ.11.74 లక్షలు ఇస్తామని, లక్షాధికారి మీరేనని నమ్మించారు. దీనిని నమ్మిన నర్సింలు.. తన వద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు ఉందని వారితో తెలిపాడు.
సదరు మోసగాళ్లు అకౌంట్‌ఓపెన్ చేయాలని, ఎన్‌వోసీ అని ఐటీ క్లియరెన్స్ పలు దఫాలుగా డబ్బులు పంపించాలని తెలిపారు. నిజమే అని నమ్మిన బాధితుడు పది విడతల్లో మొత్తం రూ.8.35 లక్షలు వారు చెప్పిన వ్యాలెట్లు, అకౌంట్లలో జమ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని వారు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. శుక్రవారం దేవునిపల్లి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని పోలీసుల ముందు తెలియజేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు దేవునిపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు. బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్ పశ్చిమబెంగాల్‌కు చెందినదిగా గుర్తించామని తెలిపారు. అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు, బహుమతులు ఇలా రకరకాలుగా ఫోన్‌కాల్స్ వస్తే స్పందించవద్దని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: Gas Cylinder: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? మీకో బంపర్ ఆఫర్.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్