
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం ఈ మధ్యకాలంలో కొందరు యువకులు దారి తప్పుతున్నారు. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మహమ్మద్ అబూబకర్ అలీ అనే యువకుడు కూడా అదే బాటలో వెళ్లి చివరకు కటకటాల పాలయ్యాడు. వృత్తిరీత్యా జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఇతగాడు, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అవ్వడానికి ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అబూబకర్ అలీ సాధారణ ఫోటోలను ఏఐ టెక్నాలజీ సహాయంతో మార్చేసి, తాను ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా ఉన్నట్లు వీడియోలు, ఫోటోలు రూపొందించాడు.
ఖాకీ డ్రెస్సులో గంభీరంగా కనిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన సామాన్యులు నిజంగానే అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అని నమ్మేవారు. కేవలం రీల్స్‌కే పరిమితం కాకుండా, తనకు ఉన్నత స్థాయి అధికారులతో సంబంధాలు ఉన్నాయని, చివరికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇప్పించగలనని కొందరిని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి హావభావాలు, పోస్టులపై అనుమానం వచ్చిన రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు.
అతడి ప్రొఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అతను పోలీస్ కాదని, ఒక సామాన్యుడని తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అబూబకర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానిలోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని వాడుకుని ఇంకెవరినైనా మోసం చేశాడా లేదా ఆర్థిక లావాదేవీలు జరిపాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. “సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రభుత్వ అధికారుల పేర్లను, హోదాలను వాడుకుంటే కఠిన చర్యలు తప్పవు” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని మంచికి వాడాలి కానీ, ఇలాంటి నేరాలకు వాడితే భవిష్యత్తు అంధకారమవుతుందని సూచిస్తున్నారు.