చాణక్య నీతి: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన విషయం ఇదే

07 May 2026

Rajashekher

ఆచార్య చాణక్య భారత చరిత్రలో అత్యంత గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్తగా గుర్తింపు పొందాడు. ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ లక్షలాది మందికి జీవన మార్గదర్శకంగా నిలుస్తోంది. 

తన అసాధారణ మేధస్సుతో శక్తివంతమైన రాజు ధననందుడిని ఓడించి, చంద్రగుప్త మౌర్యను సింహాసనంపై కూర్చోబెట్టిన మహా వ్యూహకర్త చాణక్యుడు. 

జీవితంలో ఎదురైన అనుభవాలు, అవమానాలు, విజయాలు, పరాజయాల నుంచి నేర్చుకున్న పాఠాలనే ఆయన ‘చాణక్య నీతి’లో పొందుపరిచాడు.

ఈ గ్రంథంలో ఆదర్శ భర్త, ఆదర్శ భార్య లక్షణాలు, జీవితంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? విజయాన్ని సాధించాలంటే వ్యక్తి ఎలా ఆలోచించాలి? వంటి ఎన్నో విలువైన విషయాలను చాణక్యుడు వివరించాడు. 

అందుకే చాణక్యుడి ఆలోచనలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయి. చాణక్యుని ప్రకారం, ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. 

ఒకవేళ వాటిని తేలికగా తీసుకుంటే జీవితం కష్టాల్లో పడే అవకాశం ఉంది. కానీ, వాటి విలువను అర్థం చేసుకుని జాగ్రత్తగా జీవిస్తే.. ఎవరూ మిమ్మల్ని సులభంగా ఓడించలేరు.

కాలం.. చాణక్యుడు చెప్పినట్లుగా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది కాలం. ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన సమయం మాత్రం తిరిగి రావడం అసాధ్యం. 

సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. కానీ కాలాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తి అవకాశాలను కోల్పోయి చివరకు నష్టపోతాడు. 

అందుకే ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేయడం విజయానికి మొదటి మెట్టు అని చాణక్యుడు ఉపదేశించాడు. సమయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరని స్పష్టం చేశాడు.