Hyderabad: ‘ప్లీజ్’.. వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి’.. నగర పౌరులకు సీపీ అభ్యర్థన

|

Jul 21, 2023 | 4:54 PM

తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి వాన ముసురు కొనసాగుతుండటంతో.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad: ప్లీజ్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి.. నగర పౌరులకు సీపీ అభ్యర్థన
CV Anand
Follow us on

తెలంగాణ, జులై 21:  హైదరాబాద్ నగర ప్రజలకు అలెర్ట్. వర్షం మరో 2 రోజులు దంచి కొట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. అత్యవసరం అయితేనే ఆఫీసులకు వెళ్లాలని సూచించారు. “ఈ ఎడతెరపి లేని వర్షంలో రెయిన్‌కోట్లు, జంగిల్ షూలు ధరించి  విధులు నిర్వర్తిస్తున్న మా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి పౌరులందరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నాను” అని సీవీ ఆనంద్ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడి వర్షపు నీటితో నిండిపోతున్న నేపథ్యంలో.. ప్రమాదాలను నివారించేందుకు సీపీ ప్రజలను అలెర్ట్ చేశారు.

నగరంలో ప్రజలు ఎవరైనా వరదలో చిక్కుకుపోయినా, చెట్ల కొమ్మలు విరిగి పడినా, ఇతర వర్షపాత సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా… హెల్ప్‌లైన్ నంబర్‌లు 040-21111111 లేదా 9000113667  కాల్ చేయాలని అధికారులు సూచించారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో జూలై 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.

దంచికొడుతున్న వానలతో ప్రజలారా బీ అలర్ట్‌. అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం, మీ కొంప కొల్లేరైపోవడం గ్యారంటీ. ముఖ్యంగా హైదరాబాద్‌వాసులకు డేంజర్‌ వార్నింగ్‌ ఇస్తోంది జీహెచ్‌ఎంసీ. వచ్చే 24గంటల్లో మరీ అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలంటోంది. అనవసరంగా బయటికొచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దంటోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కుమ్రంభీమ్‌, మంచిర్యాల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జనం అలెర్ట్‌గా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..