హైదరాబాద్: భాగ్యనగరంలో డేటా చోరీ కేసు కాక పుట్టిస్తోంది. ఈ వివాదంపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్ ఇన్‌ఛార్జి అయిన స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ వీలైనంత తొందరగా డేటా చోరీ కేసును పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు.
ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్‌తో పాటు ఇంకా ఏదైనా కంపెనీలు గానీ, వ్యక్తులు గానీ ఉన్నారా అనేది కూడా పరిశీలిస్తున్నాము. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థకు ఎలా వచ్చిందన్న విషయం, అది సేవా మిత్రా ఆప్‌లోకి రావడంపై దృష్టిపెట్టి పురోగతి సాధించినట్టు చెప్పారు. త్వరలోనే కేసు విచారణకు సంబంధించిన వివరాలను కోర్టుకు నివేదిస్తామని రవీంద్ర తెలిపారు.