Hyderabad: అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..

గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో పాటు ఆమె సహచరులను అరెస్టు చేశారు. బోడుప్పల్‌లో జరిగిన ఈ సంచలన కేసులో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిజాన్ని బయటపెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.

Hyderabad: అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..
Purnima Mahesh Sai Kumar

Edited By:

Updated on: Dec 22, 2025 | 8:11 PM

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అత్యంత పక్కా దర్యాప్తుతో ఓ సంచలన హత్య కేసును ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొదట గుండెపోటుగా చిత్రీకరించిన ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె. అశోక్ (45) హత్య కేసులో అతని భార్య జె. పూర్ణిమ (36)తో పాటు ఆమె సహచరులు పలేటి మహేష్ (22), భుక్య సాయి కుమార్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త అశోక్ ఇంట్లోని బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడని, మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని తెలిపింది. మొదట ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు సాధారణ కేసుగా నమోదు చేశారు. కానీ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు చెంప, మెడపై గాయాలు, విరిగిన పళ్లు కనిపించడంతో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు కేసును కీలక మలుపు తిప్పాయి. దర్యాప్తులో పూర్ణిమకు అదే కాలనీలో గతంలో నివసించిన పలేటి మహేష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్ భార్యను ప్రశ్నించడం ప్రారంభించాడు. దీంతో భర్తను అంతమొందించాలని పూర్ణిమ నిర్ణయించుకుంది. ఈ హత్యకు భుక్య సాయి కుమార్ సహాయం తీసుకున్నారు. ముందుగా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు.

డిసెంబర్ 11 సాయంత్రం 6.15 గంటల సమయంలో అశోక్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన వెంటనే మహేష్, సాయి కలిసి అతడిని పట్టుకున్నారు. అదే సమయంలో పూర్ణిమ అతని కాళ్లు పట్టుకుంది. మహేష్ చున్నీలతో అశోక్‌కు ఉరి బిగించి హత్య చేశాడు. హత్య అనంతరం మృతుడి బట్టలు మార్చి, రక్తపు మరకలున్న వస్తువులు తొలగించి, ఆధారాలు నాశనం చేసే ప్రయత్నం చేశారు. గుండెపోటుతో మృతి చెందాడంటూ బంధువులను తప్పుదోవ పట్టించారు. పోలీసులు నిందితుల నుంచి.. రక్తపు మరకలున్న మూడు చున్నీలు, రక్తపు మరకలున్న బట్టలు.. హత్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలున్న పెన్‌డ్రైవ్, ఐఫోన్–15, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మొదట నమోదు చేసిన కేసును సెక్షన్ 194 BNS నుంచి 103(1), 238 r/w 3(5) BNS సెక్షన్ల కిందకు మార్చారు. ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును బలపరుస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.