తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది. ఆశావహులు ఎక్కువగా ఉండటం.. వివిధ సమీకరణాలు సరిచూసుకోవాల్సి రావడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. ఈ విషయంలో దాదాపుగా కసరత్తు పూర్తిచేసిన కాంగ్రెస్ హైకమాండ్.. త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎవరికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్నదే.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో.. వీలైనంత తొందరగా పిసిసి కొత్త అధ్యక్షుడితో పాటు, రెండో దశ కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే ఎలాంటి వ్యతిరేకత రాకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గానికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందరి అభిప్రాయాలు తీసుకుని మరీ ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే పనిలో ఉంది కాంగ్రెస్. ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యటనలోనూ పీసీసీ ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
పిసిసి అధ్యక్ష పదవి.. నాకంటే నాకు కావాలంటూ సీనియర్లంతా.. బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలని.. అధిష్ఠానంపై సదరునేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గం నేత ఉన్నారు కాబట్టి.. పీసీసీని బీసీ వర్గానికి ఇవ్వాలని హై కమాండ్ ఆలోచిస్తోంది. దీంతో, పార్టీలో ఆ వర్గం నేతలైన మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్ పేర్లు తెరమీదకు వచ్చేశాయి. ఇప్పటికే సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా, ప్రచారకమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మహేష్ కుమార్‌గౌడ్‌కి అందరినీ కలుపుకొని పోయే నేతగా, సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా బలమైన ఫాలోయింగ్ ఉంది. కానీ, ఏఐసీసీ స్థాయి పరిచయాలు అంతగా లేకపోవడం.. పీసీసీ రేసులో మహేష్‌కుమార్ గౌడ్ వెనకబడటానికి కారణంగా కనిపిస్తోంది. మధుయాష్కీ గౌడ్‌కి ఏఐసిసి పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పీసీసీ చీఫ్ ఎంపికలో.. ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఈసారి ఎస్సి లేదా ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసి చీఫ్‌గా అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరమీదికొచ్చాయి. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్టు.. బలరాం నాయక్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పడం విశేషం. ఒకవేళ ఎస్సి సామాజిక వర్గానికి ఛాన్సిస్తే… తనకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ఇదే కోటాలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ ఇప్పటికే, ఢిల్లీ పెద్దల దగ్గర.. పదవికోసం పట్టుబట్టినట్లు సమాచారం. శ్రావణమాసం ముగిసేలోపు.. పీసీసీ నియామకం జరిగిపోవాలని హైకమాండ్ భావిస్తున్న వేళ.. బీసీలకైతే మధుయాష్కీ, ఎస్టీలకైతే బలరాం నాయక్.. ఇదే ఫైనల్ అనే చర్చ జోరందుకుంది. ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంపత్ కుమార్‌ల పేర్లు కూడా ఖరారు అయినట్లు లీకులొస్తున్నాయి. పిసిసిలో ఈసారి మహిళలకు చోటు కల్పించాలని కూడా హైకమాండ్ భావిస్తోంది. అంతేకాదు, పీసీసీ పదవులతో పాటు, కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటోంది. అతి త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందంటున్నాయి పీసీసీ వర్గాలు. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి నెల రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..