Telangana: తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు.. నగర ప్రజలకు జలమండలి అలర్ట్.. అలా చేస్తే క్రిమినల్ కేసులు

|

Jun 21, 2022 | 8:20 PM

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బుధ, గుర వారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana: తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు.. నగర ప్రజలకు జలమండలి అలర్ట్.. అలా చేస్తే క్రిమినల్ కేసులు
rains
Follow us on

weather update: తెలంగాణ ప్రజలకు వాతావారణ శాఖ అలెర్ట్. ఇప్పటికే దంచికొడుతున్న వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవ్వనున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గురవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించిన  ఉపరితల ద్రోణి బలహీనపడిందని… గాలులు నైరుతి నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా ఉంది. దీంతో మంగళ, బుధ గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఇటు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆకాశం మేఘావృత‌మై ఉంది. నగరంలో సాధార‌ణ నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా ఆటంకం ఏర్పడింది.  భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమయ్యింది. హైదరాబాద్ లో 16 మాన్ సూన్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసింది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను నిత్యం పర్యవేక్షించాలని, డ్రైనేజీ పనులకు సంబంధించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని అధికారులను  జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని ప్రజలకు సూచించారు.  మ్యాన్ హోల్ మూత తెరవడం జలమండలి యాక్ట్ లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్ హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చిరించారు.
ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేయాలని సూచించారు.

తెలంగాణ వార్తల కోసం..