సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఇక ఇదే తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ ట్రైన్. ఈ రైలు గంటకు 180కి.మీ వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుందని రైల్వేశాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. దీని బట్టి చూస్తే ఇప్పటిదాకా పై రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది.
అలాగే ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.
మరోవైపు ఈ ట్రైన్ వారంలో అన్ని రోజులు నడవనుంది. ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. 20 నిమిషాల బ్రేక్‌తో తిరిగి విశాఖకు బయల్దేరి.. రాత్రికి చేరుకుంటుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లు అయిన విజయవాడలో 5 నిమిషాలు.. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లలో రెండేసి నిమిషాల చొప్పున అగనుంది. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రాధమికంగా నిర్ణయించిన టైమింగ్స్ ఇలా ఉన్నాయి.
విశాఖపట్నంలో ఈ ట్రైన్ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్ మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌లో 2.45 గంటలకు బయల్దేరి.. విశాఖపట్నంకు తిరిగి రాత్రి 11.25 గంటలకు చేరుకుంటుంది. ఇక ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉండే ఈ రైలులో ఏసీ చైర్ కార్ ధర రూ. 1800, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3300 వరకు ఉండొచ్చునని అంచనా. కాగా, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్, టికెట్ ధరలు, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందన్న విషయంపై ఇంకా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.