
వైమానిక దళంలో భారతదేశానికి సేవలు అందించి.. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో బాధ్యతలు చేపట్టి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభకు 2014లో ఎన్నికయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖలో పనిచేసారు. రాష్ట్ర శాసనసభకు వరుసగా ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 1999లో మొదటిసారిగా ఆయన కోదాడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికవవ్వగా.. 2014 లో ఆయన హూజూర్‌నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు. మరోవైపు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 2015-2021 వరకు పనిచేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ తరపున హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీలో సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎం అభ్యర్ది రేసులో ముందు వరుసలో ఉన్నారు.
1962, జూన్ 20న సూర్యాపేటలో జన్మించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణి. బీఎస్సీ డిగ్రీ పట్టా పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భారత వైమానిక దళంలో పైలట్‌గా సేవలు అందించారు. అలాగే రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్‌గా కూడా తన సేవలనందించారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచారు. తద్వారా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు గెలిచారు ఉత్తమ్ కుమార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారాయన. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా పని చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ 75 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటు ఎగ్జిట్ పోల్స్‌లో చాలా సర్వేలు కాంగ్రెస్‌కే ఓటు వేయడంతో.. ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..