Hyderabad: కొత్త కారులో నైట్‌ రైడ్‌కు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు!

శుక్రవారం హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్త కారులో సరదాగా నైట్‌రైడ్‌కు బయల్దేరిన ముగ్గురు స్నేహితులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ముగ్గురు స్నేహితుల కలిసి వెళ్తున్న కారు ఓఆర్ఆర్‌పై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు

Hyderabad: కొత్త కారులో నైట్‌ రైడ్‌కు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు!
Orr Acident

Updated on: May 11, 2025 | 9:50 AM

కొత్త కారు కొన్నామని స్నేహితులతో కలిసి నైట్‌ రైడ్‌కు బయల్దేరిన ముగ్గురు స్నేహితులు ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట్‌లో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ బహదూర్‌పురాలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నరితేశ్‌ అగర్వాల్‌ ఇటీవలే కొత్త కారు కొన్నారు. అయితే అతని కుమారుడు దీపేశ్‌ అగర్వాల్ కారులో సరదాగా నైట్‌ రైడ్‌కు వెళ్దామనుకున్నాడు. దీంతో స్నేహితులను కలిసి వస్తానని చెప్పి కొత్త కారును తీసుకొని శుక్రవారం రాత్రి దీపేశ్ బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో మొదటగా కార్వాన్‌లోని విజయనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సంచయ్ మల్పానీ, ప్రగతినగర్‌లో ఉంటున్న ప్రియాన్ష్‌ మిత్తల్‌ను తీసుకొని ఓఆర్ఆర్ మీదుగా ఘట్‌కేసర్‌ వైపు బయలుదేరారు.

ఇక అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్ పరిధిలోని గండిచెరువు సమీపంలోకి రాగానే అదుపు తప్పిన ముగ్గురు స్నేహితులతో వెళ్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. కారు బొలేరోను ఢీకొట్టిన వెంబడే కార్లతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పట్టికే కారు మొత్తం మంటలు వ్యాపించడంతో అగర్వాల్, సంచయ్‌ మంటల్లోనే సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. ప్రియాన్ష్‌ను మాత్రం కారు నుంచి బయటకు తీసిని స్థానికులు వెంటనే స్థానిక ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ప్రియాన్ష్‌ కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

ఎలాంటి సిగ్నల్స్‌ లేకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాన్ని పార్క్‌ చేశారని బొలేరో వాహనం డ్రైవర్‌పై దీపేశ్ అగర్వాల్ తండ్రి రితేశ్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..