మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్ బాగ్‌లో ఉదయం పాల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వద్ద నుంచి అందరూ చూస్తుండగానే దర్జాగా జేబు నుంచి దుండగులు మొబైల్ ఫోన్ కొట్టేశారు. ఎలా అంటారా?.. షాపులో ఏదైనా కొనడానికి వచ్చినప్పుడు ఎక్కువ మంది గుమిగూడి ఉన్నప్పుడు దృష్టి అంతా మనం తీసుకోవాల్సిన వస్తువు మీదే ఉంటుంది. అలాంటి హడావిడి సమయాల్లో మీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టిని మరల్చారు. నేల మీద ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఆ వ్యక్తి వంగినప్పుడు తీరిగ్గా ఇటు జేబులో ఉన్న ఫోన్ మాయం చేశారు. ఆ హడావిడిలో ఆ వ్యక్తి జరిగేది గమనించకుండా తరువాత ఫోన్ పోయినట్లు సదరు వ్యక్తి గ్రహించాడు. తీరా అప్పటికే దొంగతనానికి పాల్పడ్డ వారు అక్కడి నుంచి పరారైయ్యారు. అప్పటికే దగ్గర్లోనే బండి స్టార్ట్ చేసి ఇతని కోసం మరో ఇద్దరు యువకులు వేచి ఉన్నారు. ఇంకేముంది.. దొంగతనం చేసిన నిందితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకుని బండిపై ఎక్కి వాళ్లతో పాటు పరారైయ్యాడు. జరిగింది గ్రహించిన అనంతరం బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుంచి కూడా ఇలాగే మొబైల్ చోరీ జరిగింది. ఇలా ఒకే రోజు రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.