Police Constable Humanity : స్వంత పనుల కోసం ఊరు కానీ ఊరు చేరాడు. దారి కరువై, దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ దీనస్థితికి చేరాడు. ఇది గమనించిన ఓ పోలీసు.. చేరదీసి ఆశ్రయం కల్పించాడు. నగరానికి వచ్చి దారి తెలియక, ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడిని ఫలక్‌నుమా పోలీస్ కానిస్టేబుల్ చేరదీశాడు. అతని గురించి సమాచారం తెలుసుకుని స్వస్థలానికి చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ప్రాంతానికి చెందిన కమలాకర్ అనే వృద్ధుడు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. తన ఇంటి నుంచి మరో ఊరికి వెళ్తూ దారితప్పి హైదరాబాద్ చేరుకున్నాడు. దీంతో ఎటు వెళ్లాలో తెలియని కమలాకర్.. శంషీర్‌గంజ్‌లోని గోశాల వద్ద తచ్చాడుతుండగా ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కమల్ షెట్టి గమనించాడు. వృద్ధుడ్ని ప్రశ్నించడంతో కన్నీటి పర్యంతమై ఆకలితో అలమటిస్తున్నానని తన గోడు వెల్లబోసుకున్నాడు. స్వస్థలానికి వెళ్లడానికి కూడా డబ్బులులేవని చెప్పాడు.
దీంతో కానిస్టేబుల్ వృద్ధుడికి కడుపునిండా భోజనం పెట్టించి ధైర్యం చెప్పాడు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అతని బాధను ఇన్‌స్పెక్టర్‌కు వివరించాడు. వృద్ధుడిని స్వస్థలానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయమని సూచించడంతో ఆయన సలహామేరకు వృద్ధుడుని ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి స్వగ్రామానికి వెళ్లే బస్సులో కూర్చొబెట్టి టికెట్ కూడా ఇప్పించి పంపించారు. అంతేకాదు, అతనికి కొంత నగదు చేతులో పెట్టి సాగనంపాడు. ఊరి కాని ఊరికి వచ్చిఅవస్థలు పడుతున్న వృద్ధున్ని చేరదీసి స్వస్థలానికి వెళ్లేలా చూసిన కానిస్టేబుల్ కృషిని పలువురు అభినందించారు.
Read Also… ఎంసెట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ మార్కుల వెయిటేజ్ యథాతథం.. స్పష్టం చేసిన ఉన్నత విద్యాశాఖ