
తనకు దక్కనిది మరొక వ్యక్తికి దక్కడానికి వీలు లేదు అనుకున్నాడు. పక్క ప్లాన్ వేసాడు. తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. తాను ప్రేమించిన యువతిని దూరం చేసాడు అని కక్ష పెంచుకున్న ఓ యువకుడు స్నేహితులతో కలిసి జూనియర్ ఆర్టిస్ట్‌ను హతమార్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌కు చెందిన కార్తిక్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడు. కార్తీక్ వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతిని అంతకుముందు విజయనగరం జిల్లాకు చెందిన సాయి అనే జూనియర్ ఆర్టిస్ట్‌తో సన్నిహితంగా మెలిగేది. కార్తిక్ తో పరిచయం ఏర్పడిన తరువాత సదరు యువతి సాయిని దూరం పెట్టింది. దీన్ని భరించలేకపోయాడు సాయి. తన ప్రేయసిని దూరం చేశాడని కార్తిక్ పై కక్ష పెంచుకున్నాడు. ఎలా అయినా కార్తీక్‌ను అడ్డు తొలగించాలి అని భావించాడు.
గత నెల 13వ తేదీన ఆ యువతికి సంబంధించిన లగేజ్ బ్యాగ్ తన వద్ద ఉందని చెప్పి కార్తీక్‌ను బోయిన్‌పల్లి ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుకు బైక్‌పై తీసుకు వెళ్ళాడు సాయి. ముందస్తు ప్లాన్ ప్రకారం సాయి స్నేహితులైన సురేష్, రఘు, జగదీష్ అక్కడే ఉన్నారు. ఈ నలుగురు కలిసి కార్తీక్ పై దాడికి దిగారు. ముగ్గురు కార్తీక్ చేతులు విరిచి పట్టుకోగా.. సాయి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఆపై అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. తన అన్న కొడుకు కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన కార్తీక్ చిన్నాన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కార్తీక్ కోసం గాలించారు. తాను సాయితో బయటకు వెళ్తున్నట్లు 13వ తేదీని కార్తీక్ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. విచారణలో భాగంగా తల్లి చెప్పిన విషయాన్ని గమనించిన పోలీసులు సాయిపై అనుమానాన్ని వ్యక్తం చేశా.రు ఆరోజు నిందితుడికి సంబంధించిన ఫోన్ లొకేషన్ ట్రాక్ చేశారు. ప్రేమించిన యువతి నుంచి సమాచారం రాబట్టారు.
ఫోన్ సిగ్నల్స్ కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసిన విషయాన్ని సాయి అంగీకరించాడు. ఘటనా స్థలానికి వెళ్లినటువంటి పోలీసులు గుట్టల్లో కార్తీక్ మృతదేహం కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో గుర్తించారు. ఎముకలు కూడా అక్కడక్కడ కనిపించాయి. ఆధారాలు సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.