హైదరాబాద్‌లో మోదీ టూర్.. మరో అశ్వమేధ యాగానికి ట్రయల్ రన్! ఆ గ్యాప్‌లో ఏం జరగనుంది..

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయనగా.. ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏదో యాధృచ్చికంగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ కాదిది. ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న క్షణం ఇది. ఆ అడుగు మామూలుగా ఉండకూడదనుకున్నారో ఏమో.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలంగాణలో ముహూర్తం ఉండాలని ముందుగా నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్‌లో మోదీ టూర్.. మరో అశ్వమేధ యాగానికి ట్రయల్ రన్! ఆ గ్యాప్‌లో ఏం జరగనుంది..
PM Modi Hyderabad Visit

Updated on: May 09, 2026 | 9:49 PM

ప్రధాని మోదీ షెడ్యూల్ అంటేనే చాలా హెక్టిక్‌గా ఉంటుంది. ప్రతి నిమిషం కౌంట్ అక్కడ. ఓ 5 మినిట్స్ లీజర్ దొరికినా సరే.. ఎవరికో ఒకరికి అపాయింట్‌మెంట్ ఇస్తారు. అలాంటిది ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్‌లో రిజర్వ్ టైమ్ పెట్టారు. ఐదు పది నిమిషాలు కాదు.. ఏకంగా గంటన్నర. ఆ టైమ్‌లో నో పర్టిక్యులర్ షెడ్యూల్. ఏం చేస్తారు ఆ రిజర్వ్‌ టైమ్‌లో? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ప్రధాని మోదీ రావడం సర్వసాధారణమే అయినా.. ఈసారి మాత్రం రెగ్యులర్ టూర్ కాదు. ఆదివారం పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభకు నేతలంతా సిద్ధంగా ఉన్నా సరే.. ఆ సభకు ముందు వచ్చే ఈ రిజర్వ్ టైమ్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఎందుకని? మూడోసారి ప్రధాని అయ్యాక.. తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న ప్రధాని మోదీ టూర్ ఎందుకంత ప్రత్యేకం కాబోతోంది.

హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్ర ఉండేది బీజేపీ మీద. బెంగాల్ విజయంతో అదిప్పుడు చెరిగిపోయింది. కేవలం ఉత్తరాది పార్టీ అనే ముద్ర కూడా ఉంది బీజేపీ మీద. అదిప్పుడు చెరిగిపోవాలి. అంటే ఏం చేయాలి? దక్షిణాదిన బలమైన అడుగులు వేయాలి. అధికారంలోకి రావాలి. అందుకు అర్జెంట్‌గా ఒక స్టేట్ కావాలి. అది తెలంగాణనే అని తన రాకతో చెప్పాలనుకుంటున్నారు ప్రధాని మోదీ. బెంగాల్‌లో హ్యూజ్ విక్టరీ సాధించిన తరువాత.. బెంగాలీ ప్రజలు ఇచ్చిన విజయానికి మోకరిల్లి మరీ ధన్యవాదాలు చెప్పాక.. ఇక తన ప్రయాణం దక్షిణాది వైపు, పర్టిక్యులర్‌గా తెలంగాణలో అని సంకేతాలు ఇచ్చారు. ఇంతకీ.. వై తెలంగాణ. దక్షిణాది జైత్రయాత్రను తెలంగాణతోనే ఎందుకు మొదలుపెట్టాలానుకుంటున్నారు?

బెంగాల్‌లో బీజేపీ విన్ అవగానే.. సౌత్‌లో ఓ పెద్ద చర్చ జరిగింది. పర్టిక్యులర్‌గా తెలంగాణలో. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనే అని. రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రముఖులు, పాలిటిక్స్‌పై కాస్త ఇంట్రస్ట్ ఉన్న వ్యక్తులు.. ఇలా అందరూ కామన్‌గా మాట్లాడుకున్న టాపిక్.. టార్గెట్ తెలంగాణ అని. ఏం.. తెలంగాణే ఎందుకు? బీజేపీ టార్గెట్ తెలంగాణ కాదు. ఆ మాటకొస్తే ప్రతీ రాష్ట్రం చేజిక్కించుకోవాలన్నదే కమలదళం లక్ష్యం. అక్కడ కాంగ్రెస్సే ఉండని, ఆ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులే ఏలని. కాషాయ జెండా ఎగరాల్సిందేనన్న కసి ఆ పార్టీది. అయితే.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనే అని అంత పర్టిక్యులర్‌గా ఎందుకంటున్నారు? దీనికో రీజన్ ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయనగా.. ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏదో యాధృచ్చికంగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ కాదిది. ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న క్షణం ఇది. ఆ అడుగు మామూలుగా ఉండకూడదనుకున్నారో ఏమో.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలంగాణలో ముహూర్తం ఉండాలని ముందుగా నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ ముహూర్తం ఖరారవడానికి మరో కారణం.. బెంగాల్‌లో విజయం ఖాయం అని మే 4వ తేదీకి ముందే బీజేపీకి అంచనాలుండడమే కావొచ్చు. కచ్చితంగా గెలుస్తాం అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తోనే తెలంగాణ టూర్ ఫిక్స్ అయినట్టు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ.

మరో థియరీ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో గానీ.. ఓ లింక్ కూడా కనిపిస్తోంది. అదేంటంటే.. ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగిసిందేమో ఏప్రిల్ 29న. ఓ ఒకట్రెండు రోజుల తరువాత కౌంటింగ్ పెట్టుకోవచ్చు. లేదా 3వ తేదీ ఆదివారం. ఆరోజు కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. బట్.. పర్టిక్యులర్‌గా 4వ తేదీ, అందులోనూ సోమవారమే ఎందుకు ఫలితాలు వెల్లడించారు. ఇట్స్ నాట్ జస్ట్ కో-ఇన్సిడెన్స్. ఆరోజు సోమవారం కాబట్టి.. స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి.. కావాలనే ఆ ముహూర్తం పెట్టారట. ఇదో చర్చ జరుగుతోంది బయట. అంటే.. బెంగాల్‌లో బీజేపీ అఖండ విజయం ఖాయం అనే ధీమా బీజేపీకి ఉంది. ఆ ధీమా ఉంది కాబట్టే అంత ధైర్యంగా సోమవారం నాడు కౌంటింగ్‌కు ముహూర్తం పెట్టించుకుందని ఓ టాక్. బెంగాల్‌లో గెలుస్తామనే గట్టి నమ్మకం బీజేపీకి ఉంది కాబట్టే.. తెలంగాణ టూర్ కూడా ఫిక్స్ అయింది అని కూడా చెప్పుకున్నారు.

బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇక తెలంగాణనే అని అనడానికి మరో కారణం.. 15 ఏళ్ల పాటు దీదీ ఏలుతున్న సామ్రాజ్యాన్ని, అందులోనూ ఒకనాటి కమ్యూనిస్టుల కోటనే ఢీకొడుతున్నాం అని నమ్మకం ఏర్పడినప్పుడు తెలంగాణను సైతం గెలవలేమా అనే ధీమా ఆ పార్టీది. దాని ఫలితమే ఈ ఆదివారం నాడు తెలంగాణలో ప్రధాని మోదీ అడుగుకు ముహూర్తం.

కేరళంలో విజయన్ ఓడిపోయాక.. ఒక విషయంలో తన బాధని, ఆందోళనని అడ్రస్ చేశారు. ‘అయ్యో హ్యాట్రిక్ సీఎం అనే ట్యాగ్ మిస్ అయ్యానే, పార్టీ ఓడిపోయిందే’ అని కాదు ఆ ఆందోళన. బీజేపీకి కేరళంలో మూడు అసెంబ్లీ స్థానాలు రావడమే పినరయి విజయన్‌లో అత్యంత ఆందోళన కలిగించిన అంశం. ఏంటి మూడింటికే అంటారా! కచ్చితంగా..! కమ్యూనిస్టులు కంగారు పడాల్సిన మ్యాటర్ అండ్ నెంబర్ అది. పదేళ్ల తరువాత కేరళం అసెంబ్లీలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడం అదే మొదటిసారి. అందులోనూ ముగ్గురు వెళ్తున్నారు సభలోకి.

కమ్యూనిస్టులు పినరయి విజయన్ గురించి ఓ విషయం గొప్పగా చెప్పుకునే వారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు కేరళంలో బీజేపీని ఎదగనివ్వలేదు చూశారా అని చెప్పుకునే వారు. తీరా చూస్తే 30 అసెంబ్లీ సీట్లలో మూడు సీట్లు గెలుచుకొచ్చింది కాషాయదళం. సో, కేరళంలో మున్ముందు ఏం జరగబోతోందో చెప్పడానికి ఇదో సంకేతం. బెంగాల్‌లో కూడా ఒకప్పుడు ఒక శాతం ఓటు షేర్ మాత్రమే ఉంది బీజేపీకి. హా.. ఏం వస్తుందిలే, ఇదసలే కమ్యూనిస్టుల కంచుకోట, ఇక్కడ ఎర్రజెండా పోయి కాషాయ జెండా రావడమా, అసాధ్యం అని అనుకున్నారంతా. కాని, కమలదళం దూసుకొచ్చింది.

2016లో బెంగాల్‌లోనే గట్టిగా ట్రై చేసింది బీజేపీ. కాని ఓడింది. ఆనాడు బీజేపీకి వచ్చింది మూడే సీట్లు. వచ్చింది సింగిల్ డిజిట్ కదా అని నిరాశపడలేదు. ఏమీ లేని దగ్గర మూడు సీట్లొచ్చాయ్ అనే కసితో పనిచేసింది. 2021లో మరింత పట్టుదలగా ప్రయత్నించింది. కాని, అప్పుడూ ఓడింది. బట్, ఏకంగా 77 సీట్లు వచ్చాయ్. డబుల్ డిజిట్ సీట్స్. ఇక 2026లో తాడోపేడో తేల్చుకోవాలనుకుంది. గెలిచింది. ఏకంగా 207 సీట్లు. సింగిల్ డిజిట్ నుంచి సింగిల్ హ్యాండ్‌తో అధికారాన్ని కైవసం చేసుకుంది.

కేరళంలో ఇవాళ వచ్చిన సీట్లు కూడా మూడే. మరో ఐదేళ్ల తరువాత? మరో పదేళ్ల తరువాత? ఏమో ఎవరు మాత్రం చెప్పగలరు. బెంగాల్‌లో మహా అయితే 100 లేదా 150 సీట్లకే బీజేపీ పరిమితం అవుతుందనేది చాలా మంది విశ్లేషణలు. కారణం.. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ 30 శాతం దాకా ఉంది కాబట్టి. ఆ ఓట్లన్నీ తృణమూల్‌కే పడతాయి అనే భావన ఉంది కాబట్టి. కొద్దిపాటి హిందూ ఓట్లు పడినా చాలు.. గెలిచేస్తాం అనే ధీమాతోనే మమత ఉన్నారు కాబట్టి. కాని, అలాంటి దగ్గర మ్యాజిక్ చేసి పడేసింది బీజేపీ. తీరా చూస్తే.. హిందూ ఓట్ల ఏకీకరణ చేసి.. బెంగాల్ గడ్డపై అఖండ విజయంతో అడుగుపెట్టింది. సో, అలాంటి చోటే గెలిచినప్పుడు.. మరే రాష్ట్రం మాత్రం టార్గెట్ కాకుండా పోతుంది బీజేపీకి? అందుకే, తెలంగాణ ఇప్పుడు బీజేపీ టార్గెట్.

ఇక అసలు విషయం. రిజర్వ్ టైమ్‌లో ఏం జరగబోతోంది? నేతల్లో ఎందుకంత టెన్షన్? జరుగుతున్న ఊహాగానాలేంటంటే.. రాష్ట్ర బీజేపీపై ఏమంత హ్యాపీగా లేదట అధిష్టానం. అందుకే, ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకునే తెలంగాణలో ల్యాండ్ అవుతున్నారట ప్రధాని మోదీ. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల షెడ్యూల్ అంతా ముగిశాక.. ఇక ఒక్కొక్కరిని పిలుస్తారట. ఆ లిస్ట్‌ల రాష్ట్ర నాయకత్వం నుంచి సీనియర్ లీడర్ల దాకా ఉన్నారని టాక్. ఈ ఫీడ్ బ్యాక్, ఇవ్వాల్సిన క్లాస్ అంతా ముగిశాకనే భారీ బహిరంగ సభకు అటెండ్ అవుతారట ప్రధాని మోదీ.

బెంగాల్‌లో అడుగుపెట్టాలని 2016 నుంచి ప్రయత్నిస్తే.. 2026లో ఆ మిషన్ కంప్లీట్ అయింది. కాని, తెలంగాణలో ఆల్రడీ ఓ అడుగు పడింది. చెప్పాలంటే.. బీజేపీకి కాస్త ఈజీ టార్గెట్ అయిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇదే విషయాన్ని నెంబర్స్ కూడా చెబుతున్నాయ్.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సాధించిన ఓట్ షేర్.. 8.52 శాతం. ఇక 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి బీజేపీ ఓట్ షేర్ 19.65 శాతానికి పెరిగింది. ఏకంగా 11.13 శాతం పెరుగుదల. ఊహించని గ్రోత్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏకంగా 35.08 శాతం ఓట్ షేర్ వచ్చింది. అంటే.. గతం కంటే మరో 15.43 శాతం పెరుగుదల. 2014లో ఒకే ఒక్క ఎంపీ.. 2019లో ముగ్గురు.. 2024లో 8 మంది. ఇదీ తెలంగాణలో బీజేపీ గ్రోత్.

ఇక అసెంబ్లీ లెక్కలు చూద్దాం. 2014లో తెలంగాణలో బీజేపీ సాధించిన ఓట్ షేర్ 4.13 శాతం. 2018లో 6.98 శాతం ఓట్లు వచ్చాయ్. 2023లో 13.90 శాతానికి పెరిగింది. లోక్‌సభ ఎన్నికలప్పటి కంటే.. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణ బీజేపీ పర్ఫామెన్స్ కాస్త వీక్‌గానే ఉంది. పైకి ఓట్ షేర్ పెరిగినట్టే కనిపించినా.. ఆశించినంతగా అయితే లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మోడీ మేనియా గట్టిగా పనిచేస్తోంది. అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి.. స్టేట్ ఇష్యూస్ హైలైట్ అవుతున్నాయ్. అందుకే.. ఈసారి వ్యూహం మార్చాలనుకుంటోంది బీజేపీ.

బెంగాల్‌లో ఎక్కడ ఫెయిల్ అయ్యామన్నది 2026కి గానీ తెలుసుకోలేకపోయింది బీజేపీ. బెంగాల్‌లో దీదీ వర్సెస్ మోదీ అనే ఫార్ములాతో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఓడింది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా.. తృణమూల్ వర్సెస్ బెంగాల్ బీజేపీ మధ్య పోటీ జరిగేలా వ్యూహరచన చేశారు. ఈ స్ట్రాటజీ సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా అలాంటి వ్యూహమే చేయబోతున్నారా?

అయితే.. ఎందుకో, ఎక్కడో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఒక అలసత్వం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ అనుమానం, అసంతృఫ్తి బీజేపీ అధిష్టానంలో కనిపిస్తోంది కూడా. గతంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపైనా, ఇక్కడ గెలిచిన ఎంపీలపైనా ప్రధాని మోదీ గుస్సా అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పోలిస్తే, సోషల్ మీడియాలో తెలంగాణ బీజేపీ నేతల ప్రదర్శన చాలా పేలవంగా ఉందని ఒకసారి ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా నేతల మధ్య వర్గపోరు, నేతలు కలిసికట్టుగా లేకపోవడం అనేది.. తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఆటంకంగా మారిందనేది బహుశా పార్టీ అభిప్రాయం కావొచ్చు. చాలా మంది నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండకుండా, హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని, ఎంపీలుగా నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదనే భావన కూడా బీజేపీ అధిష్టానంలో ఉండి ఉండొచ్చు. ఒకందుకు దీన్ని సెట్ రైట్ చేయడానికే ప్రధాని మోదీ నేరుగా తెలంగాణకు వస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్‌లో ఓ గంటన్నర సేపు రిజర్వ్ టైమ్ ఉంది. మొదటి షెడ్యూల్ ప్రకారం.. 45 నిమిషాల నుంచి గంటసేపు మాత్రమే ఉంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో అది గంటన్నరకు పెరిగింది. ఆ రిజర్వ్ టైమ్‌లో ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలను కలుస్తారా.. పార్టీలో నెలకొన్న అసమ్మతిపై క్లాసు తీసుకుంటారా అనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే.. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. మరో ఏడాది అయితే.. ఎలక్షన్ ఇయర్ మొదలైనట్టే. అయినా సరే.. పార్టీలో ఆశించిన స్థాయిలో ఊపు కనిపించడం లేదనేది అధిష్టానం భావన అయిఉండొచ్చు. అందుకే, రాష్ట్ర నేతలకు ఇలా క్లాస్ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉన్నా, నాయకుల పనితీరు సరిగ్గా లేదని, విభేదాలు వీడి సమష్టిగా పనిచేయాలని, 2028 ఎన్నికల లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని చెప్పడానికే ఆ రిజర్వ్ టైమ్ తీసుకుంటారని కూడా అంటున్నారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు రిజర్వ్ టైమ్ ఉంది. ఆ టైమ్‌లో ప్రధాని మోదీ కాస్త రెస్ట్ తీసుకుంటారని చెబుతున్నారుగానీ.. అది కేవలం విశ్రాంతి కోసం కాదు. అది తెలంగాణ బీజేపీ భవిష్యత్తును నిర్ణయించే సమయం. ఇన్నాళ్లూ వర్గ పోరుతో కునారిల్లుతున్న నేతలకు ప్రధాని నేరుగా గీతోపదేశం చేయబోతున్నారా?

ఈసారి సామూహిక భేటీలు కాదు. ఆ గంటలో కీలక నేతలతో విడివిడిగా వన్-టు-వన్ అపాయింట్‌మెంట్ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని, సీనియర్ నేతల వరకు అందరి పనితీరుపై ప్రధాని మోదీ దగ్గర రిపోర్ట్ కార్డ్ సిద్ధంగా ఉంది. నేతలు చెప్పే మాటల కంటే, తన దగ్గర ఉన్న డేటాకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. అందరూ కలిసి నడుస్తారా, లేక వెనకబడిపోతారా అని సూటిగా అడగబోతున్నారట.

ఇలా అడగడానికి మరో కారణం ఉంది. రాష్ట్ర బీజేపీకి ఒక అధ్యక్షుడంటూ ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయం నడవాలి. కాని, పార్టీలో మరో మూడు పవర్ సెంటర్స్ నడుస్తున్నాయన్నది ప్రధాని మోదీకి వెళ్లిన రిపోర్ట్ అని చెబుతున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి ఒకలా, బండి సంజయ్ మరోలా ఉంటే.. ఎంపీ ఈటల తీరు ఇంకోలా ఉందంటున్నారు. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీన్ని సెట్ రైట్ చేయడానికే ఈ రిజర్వ్ టైమ్ తీసుకుంటున్నారనేది ఇక్కడ మెయిన్ డిస్కషన్ పాయింట్.

రాష్ట్ర నేతల తీరు ఎలా ఉన్నా.. ఒక జాతీయ పార్టీగా తన పని తాను చేసుకుంటూ పోతోంది బీజేపీ. తెలంగాణలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. దీన్ని 2028 ఎన్నికలే లక్ష్యంగా వేస్తున్న తొలి అడుగుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అంతకన్నా ముందు త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. దానికి ప్రధాని మోదీ పర్యటన ఒక ఆరంభం అని చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దాదాపు 9వేల 400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అందులో ఒకటి హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్. NH-167లో గుడెబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ విలువ 3,175 కోట్ల రూపాయలు. నెక్ట్స్.. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. 2,360 కోట్లతో నిర్మించనున్న ‘ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ’కి శంకుస్థాపన చేస్తారు. ఇక 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ మూడో రైల్వే లైన్ ప్రారంభిస్తారు. ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయ్. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్ మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రాజెక్టులు కూడా మోదీ షెడ్యూల్‌లో ఉన్నాయ్.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణలో బోలెడంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయ్. హైదరాబాద్ టూర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తారని చెబుతున్నారు. మెట్రో ప్రాజెక్టు ఫేజ్‌-2 పనులకు అనుమతులతో పాటు నిధులు కేటాయింపుపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. మూసీ బ్యూటిఫికేషన్, ఫోర్త్ సిటీకి మౌలిక వసతులు.. ఇలాంటి విజ్ఞాపనలు కూడా ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా.. ప్రధాని మోదీ టూర్ ఒక్కటే చెబుతోంది. ఈసారి టార్గెట్ తెలంగాణనే అని.

Follow Us