Jubilee Hills bypoll: చెక్‌పోస్ట్ పడింది.. జూబ్లీ హిల్స్‌లో ఓట్ల వేట ముగిసింది

చెక్‌పోస్ట్ పడింది. జూబ్లీ హిల్స్‌లో ఓట్ల వేట ముగిసింది. మూడు పార్టీల హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం ఆరు తర్వాత తెరపడింది. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలైంది. పోలింగ్ నిర్వహణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. పన్లోపనిగా ఆంక్షల కొరడా ఝుళిపించింది.

Jubilee Hills bypoll: చెక్‌పోస్ట్ పడింది.. జూబ్లీ హిల్స్‌లో ఓట్ల వేట ముగిసింది
Jubilee Hills Bypoll

Updated on: Nov 09, 2025 | 8:00 PM

సైలెన్స్ ప్లీజ్.. ఆల్‌ మైక్స్ ఆర్ గప్‌చుప్ అంటూ సైరన్ మోగించింది ఈసీ. నేతల ప్రచారాలు బందవ్వడంతో జూబ్లీ హిల్స్ గల్లీలన్నీ మూగబోయాయి. నేతల టూర్లతో, కార్యకర్తల ప్రచారాలతో జాతరను తలపించిన బస్తీల్లో ఇప్పుడంతా నిశ్శబ్దమే. మంగళవారం ఉదయం మొదలయ్యే పోలింగ్‌పై దృష్టి పెట్టింది ఈసీ. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. 2వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. డ్రోన్ల ద్వారా కూడా మానిటరింగ్‌ చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్‌ ఫోకస్‌ ఉంటుంది. నాన్ లోకల్ లీడర్స్ అంతా  నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది ఈసీ. మద్యం షాపులు,హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు మూతబడతాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చెదరగొడతారు. ఓట్ల లెక్కింపు రోజు బాణాసంచా పేలుళ్లపై కూడా నిషేధం ఉంది. మొబైల్ ప్యాట్రోల్స్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, డబ్బు తరలింపును, పంపిణీని కట్టడి చేస్తున్నారు పోలీసులు. పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతోంది పోలీస్ శాఖ.

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 4 లక్షల ఒక వెయ్యీ 365 మంది ఓటర్లున్న జూబ్లిహిల్స్‌లో గత ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకుమించి ఓటింగ్ జరుగుతుందన్నది ఈసీ అంచనా.