MLA G Sayanna Passes Away: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. షుగర్ లెవల్ పడి పోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సాయన్నను వారం క్రితం కుటుంబసభ్యులు యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1.45కి మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచారు.
సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు సాయన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.
ఆ తరువాత తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..