ఆర్టీసీ కార్మికుల సమ్మె విఫలం కావడానికి ఆర్టీసీ జేఏసీయే ప్రధాన కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్‌ఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి మహమూద్. ప్రభుత్వంతో కార్మికుల డిమాండ్లను నెరవేర్చేలా చేయడం జేఏసీ నేతలకు చేతకాలేదని విమర్శించారు. గుర్తింపు సంఘంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో సానుకూలంగా ఉంటూ..తమ డిమాండ్లను విజ్ఞప్తి చేస్తూ ఉండాలని, అలా కాకుండా సమ్మె పేరుతో ముఖ్యమంత్రిని ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంతో కార్మికులకు చేటు జరిగిందన్నారు. అవగాహన లేకుండా ముక్కుసూటి ధోరణితో 48 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ..గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక ప్రకారం విలీనం సాధ్యమో, కాదో ప్రభుత్వమే తేలుస్తుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ కార్మికులు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ఆర్టీసీ కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మహమూద్ విజ్ఞప్తి చేశారు.