రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు, లారీ దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ఏషియన్ పెయింట్ డబ్బాల లోడుతో వెళ్తున్న లారీని అతి వేగంగా వెనకనుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. కంటైనర్ పాక్షికంగా కాలిపోయింది. కాగా, కారులో ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.