అందరినీ సమభావనతో చూడటం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆధ్యాత్మికత కేంద్రంగా ఉండే భారతీయ సంస్కృతి విశ్వకళ్యాణం కోసం పాటుపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో ముర్ము ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ప్రారంభించారు. షాద్‌నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
అనంతరం ప్రసంగించిన ఆమె భారతీయ ఆధ్యాత్మిక పరంపర గురించి వివరించారు. గౌతమబుద్ధుడు, ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద వంటి మహనీయులు ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక సంజీవని అందించారన్నారు ముర్ము. మహాత్మాగాంధీ రాజకీయరంగంలో కూడా ఆధ్యాత్మిక విలువలు పాటించారని కీర్తించారామె. 4 రోజుల పాటు సాగే ఈ మహోత్సవంలో దేశవిదేశాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దేశంలోని ఆధ్యాత్మిక గురువులతో పాటూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గురువులనందరినీ ఒక వేదికపైకి తీసుకురావాటం ఈ ఉత్సవాల ముఖ్యోద్దేశ్యమని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.
మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని గ్రహించి విశ్వశాంతి కోసం కృషి చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. 300 మందికి పైగా ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యే ఈ మహోత్సవ్‌లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటున్నారు.
వసుధైవ కుటుంబంకం సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ఈ కార్యక్రమం లక్ష్యాల్లో ఒకటి. మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచనల ద్వారా విశ్వ శాంతికి మార్గదర్శనం చేయటమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశ్యం. కార్యక్రమంలో భాగంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఇస్కాన్‌కు చెందిన గురు గోపాల్ దాస్ ఆసక్తికర సమాధానాలిచ్చారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..