AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒరేయ్ ఏంట్రా ఇది.. ఈ మూడు బైక్స్ నంబర్స్ గమనించారా..?

ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను మూడు హోండా యాక్టివా వాహనాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ శాఖలు, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురిని హైదరాబాద్ చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నంబర్ ప్లేట్‌తో ఫైనాన్స్ రికవరీ, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: ఒరేయ్ ఏంట్రా ఇది.. ఈ మూడు బైక్స్ నంబర్స్ గమనించారా..?
Vehicle Registration Fraud
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 5:48 PM

Share

ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో మూడు బైక్స్ రోడ్లపై తిరుగుతున్నాయంటే నమ్మగలరా? ప్రభుత్వ అధికారులను, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మోసం చేసేందుకు ఇలాంటి తెలివైన ప్లాన్ వేసిన ముగ్గురిని హైదరాబాద్‌లో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని నాకోటి మల్లికార్జున్ (28), భీమ్ అజయ్ రెడ్డి (29), కొప్పుల ధనరాజ్ (30)గా గుర్తించారు. వీరి వద్ద నుంచి TS09 FE 4997 నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న మూడు హోండా యాక్టివా బైక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మోసం ఎలా బయటపడిందంటే.. చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భీమ్ అజయ్ రెడ్డి యాక్టివాతో వెళ్తుండగా ఆపి వాహన పత్రాలు పరిశీలించారు. రిజిస్ట్రేషన్ నంబర్‌కు సంబంధించిన ఇంజిన్, చాసిస్ నంబర్లు సరిపోకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో లోతుగా విచారణ చేపట్టగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో, ఫైనాన్స్‌పై కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ లేని యాక్టివాకు మరో యాక్టివా అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను నకిలీ ప్లేట్ రూపంలో అమర్చినట్లు తేలింది. అంతేకాదు.. బ్యాంక్ రికవరీ చర్యల నుంచి తప్పించుకోవడం, ట్రాఫిక్ చలానాలు, అధికారుల తనిఖీలను తప్పుదోవ పట్టించడం కోసం అదే నంబర్ ప్లేట్‌ను మరో యాక్టివాకు కూడా ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. అంటే, ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఏకంగా మూడు వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ శాఖలు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మూడు హోండా యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? ఇలాంటి నకిలీ నంబర్ ప్లేట్లతో మరిన్ని వాహనాలు తిరుగుతున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us