
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాస్క్యులర్ సర్జరీ విభాగం వైద్యులు మరో అరుదైన ఘనతను సాధించారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పునర్జన్మ ప్రసాదించారు. నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా AngioJet Pharmaco-Mechanical Thrombectomy విధానం ద్వారా అక్యూట్ డీప్ వీన్ థ్రాంబోసిస్ వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించారు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, బయ్యారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల కొలిచేల్మి రజినీ అనే మహిళ తీవ్రమైన కాళ్ల నొప్పితో నిమ్స్‌లో చేరారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు 5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సను, తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు పూర్తిగా ఉచితంగా అందించారు.
డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. సకాలంలో దీనికి చికిత్స అందించకపోతే, ఆ రక్తం గడ్డలు గుండె ద్వారా ఊపిరితిత్తులకు చేరి పల్మనరీ ఎంబోలిజం కు దారితీస్తుంది. దీనివల్ల రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఈ చికిత్సలో వాడిన యాంజియోజోట్ విధానం ద్వారా రక్తం గడ్డకట్టిన చోటకే నేరుగా ప్రత్యేక ఔషధాలను పంపి, క్షణాల్లో ఆ గడ్డను కరిగించేస్తారు. ఆ వెంటనే యాంజియోజోట్ పరికరం సహాయంతో కరిగిన రక్తాన్ని వేగంగా బయటకు తీసేస్తారు. దీనివల్ల రక్తప్రసరణ వెంటనే సాధారణ స్థితికి వస్తుంది.సాంప్రదాయ చికిత్సలతో పోలిస్తే ఈ విధానం వల్ల రోగి చాలా త్వరగా కోలుకుంటారు. భవిష్యత్తులో కాళ్ల వాపులు, నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం దాదాపు ఉండదు.వైద్య బృందానికి అభినందనలుఇంతటి ఖరీదైన, అత్యాధునిక వైద్య చికిత్సను పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించడం నిమ్స్‌కు గర్వకారణమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు.
ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వాస్క్యులర్ సర్జరీ విభాగం హెడ్ డా. సందీప్ మహాపాత్ర,వైద్యులు డా. అనూష, డా. అరుణశ్రీ, డా. ఊహ, డా. శ్రీనిధి, డా. సుదర్శన్, డా. అమర్‌నాథ్, డా. త్రివిక్రమ్, డా. కీర్తన, డా. నలిన్ కృష్ణ, డా. నరేన్, అనస్థీషియాలజీ విభాగం, క్యాథ్ ల్యాబ్ బృందం మరియు నర్సింగ్ సిబ్బందిని డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నిమ్స్ వైద్యుల ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్య రంగంలో నిమ్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.