MIM Leader Syed Kashaf Arrest: హైదరాబాద్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవ్వరు మాట్లాడినా ఊరుకునేదే లేదంటున్నారు సిటీ పోలీసులు. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా చేతల్లోనూ చేసి చూపుతూ.. అలాంటివారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న పీడీయాక్ట్ కింద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు.. మంగళవారం ఎంఐఎమ్ నాయకుడిపైనా సేమ్ యాక్ట్‌ను ప్రయోగించి లోపలేశారు. తాజాగా, మలక్‌పేటకు చెందిన ఎంఐఎం లీడర్ సయ్యద్ అబ్దాహూ ఖాద్రీ అలియాస్ కషాఫ్‌పై PD యాక్ట్ మోపి .. చంచల్‌గూడ జైలుకు పంపారు హైదరాబాద్ పోలీసులు. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలే రచ్చ చేశాయనుకుంటే.. వాటిని నిరసిస్తూ కషాఫ్ రిలీజ్ చేసిన వీడియోలు మరింత కలకలం సృష్టించాయి.
ట్విట్టర్ ద్వారా రెచ్చగొట్టే సందేశాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. హిందూ-ముస్లింల మధ్య కషాఫ్ విద్వేషాలు సృష్టిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు.. భారీ బందోబస్తు నడుమ అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మత విద్వేశాలను రెచ్చగొడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అతనిపై పీడీయాక్ట్ నమోదు చేసి.. కటకటాల్లోకి నెట్టారు. రాజాసింగ్ వివాదాస్పద వీడియోలు పోస్టు చేసిన రోజు, అర్థరాత్రి సమయంలో జరిగిన నిరసనల్లో కషాప్ పాల్గొన్నాడు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలో అతను కూడా ఉన్నాడు. ఆ తర్వాత, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఏమాత్రం తగ్గకుండా.. రెచ్చగొట్టేలా కషాఫ్ చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీంతో, అతణ్ని జైలుకు పంపించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..