
ఫుల్‌గా మద్యం తాగి అక్కడే పడిపోవడంతో బార్ సిబ్బంది అతన్ని రోడ్డుపై వదిలేయగా ..గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్ జమీర్ అనే ఓ 35 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న చంద్ర వైన్స్ (ప్రస్తుతం ఎస్వీ రెస్టారెంట్ అండ్ బార్)లో మద్యం సేవించాడు. సరే తాగామా బుద్ధిగా ఇంటికి వెళ్లిపోయామా అని లేకుండా ఫుల్‌గా తాగి అక్కడే పడిపోయాడు. ఇక షాప్ క్లోజ్ చేసే సమయానికి జమీర్‌ను గమనించిన సిబ్బంది అతన్ని షాప్ బయట రోడ్డు సందులో వదిలేశారు. అయితే, ఎల్లప్పుడూ వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఆ సందులో పడి ఉన్న యువకుడిని గమనించని ఓ గుర్తుతెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లింది. దీంతో ఆ జమీర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదిలా ఉండగా.. ఆ వైన్స్ గురించి, అక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి ఇప్పుడు సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ చంద్ర వైన్స్ సంబంధించి ఇదేమీ కొత్త సంఘటన కాదని, ఇప్పటికే ఇక్కడ గతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పైగా వైన్స్‌కి ఎలాంటి పార్కింగ్ సదుపాయం లేదని, అయినప్పటికీ పోలీసులు గానీ, ట్రాఫిక్ సిబ్బంది గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ.. ప్రజల ప్రాణాలు తీస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైన్స్ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం కాస్తా స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ దృష్టికి చేరింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన ఈ సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆసిఫ్ నగర్ కార్పొరేటర్ మూసానిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఘటనాస్థలికి వెళ్లిన ఆసిఫ్ నగర్ కార్పొరేటర్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు నష్టం కలిగించేలా నడుపుతున్న ఇలాంటి వైన్స్ షాపులను మూసివేయాలని కంప్లైంట్ చేశారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..