Hyderabad: కూకట్‌పల్లిలో వీధి.. వీధి జల్లెడ పడుతున్న పోలీసులు.. ఎందుకంటే..?

నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కూకట్‌పల్లి జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతూ 56 షాపులపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ..

Hyderabad: కూకట్‌పల్లిలో వీధి.. వీధి జల్లెడ పడుతున్న పోలీసులు.. ఎందుకంటే..?
Kukatpally

Edited By:

Updated on: Jan 30, 2026 | 3:20 PM

నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కూకట్‌పల్లి జోన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పర్యావరణానికి, పక్షులకు, ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ప్రాణహాని కలిగిస్తున్న చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో ఈ స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టినట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కూకట్‌పల్లి జోన్ పరిధిలోని బాలానగర్‌, అల్లాపూర్‌, మియాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ పీఎస్ పరిధిలో 11 షాపులు, రాయదుర్గం పీఎస్ పరిధిలో 15 షాపులు, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 11 షాపులు, మియాపూర్ పీఎస్ పరిధిలో 6 షాపులు, కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో 8 షాపులు, బాలానగర్ పీఎస్ పరిధిలో 4 షాపులు, అల్లాపూర్ పీఎస్ పరిధిలో ఒక షాపులో తనిఖీలు చేపట్టారు. మొత్తం 56 షాపులపై రైడ్లు నిర్వహించారు.

కూకట్‌పల్లి జోన్ వ్యాప్తంగా మొత్తం 30 గాలిపటాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై 5 కేసులు నమోదు చేశారు. ఇందులో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, అల్లాపూర్ పరిధిలో ఒక కేసు, మాదాపూర్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జోన్ వ్యాప్తంగా 9 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధిక్‌నగర్‌, అయ్యప్ప సొసైటీ‌, కావూరి హిల్స్‌, కుమ్మరి బస్తీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ‌, ఆంజనేయనగర్‌, ఖాజాగూడ‌, రాజీవ్‌నగర్‌, మధురానగర్‌, ప్రశాంతి హిల్స్ కాలనీల్లో రైడ్లు నిర్వహించారు.

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ ఫేజ్‌, 7వ ఫేజ్‌, కేపీహెచ్‌బీ కాలనీ‌, హైదర్‌నగర్‌, తులసీనగర్‌, అడ్డగుట్ట ప్రాంతం, రామకృష్ణాపురం గ్రౌండ్ పరిసరాల్లో తనిఖీలు చేశారు. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పైప్‌లైన్ రోడ్‌, మదీనాగూడ‌, పాత మియాపూర్‌, మియాపూర్ మై నగర్ ప్రాంతాల్లో, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్–కూకట్‌పల్లి ప్రాంతంలో, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు కాలనీ‌, గౌతమ్‌నగర్‌లో, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయత్రినగర్‌, పార్థీవనగర్‌, వీరన్ననగర్ ప్రాంతాల్లో రైడ్లు నిర్వహించారు.

అదేవిధంగా రోడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న చైనా మాంజా దారాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్‌ 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కూకట్‌పల్లి జోన్ డీసీపీ ప్రజలను కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..