
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని దానం నాగేందర్‌ను ఆదేశించారు. దానంతో పాటు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. 30న ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా.. మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే.. ఈ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. తన అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ మారినట్లు చెబుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆధారాలు లేనివని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు ఇప్పటివరకు తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
2024 మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి హాజరైన విషయాన్ని దానం నాగేందర్ అంగీకరించారు. అయితే ఆ సమావేశానికి తాను పూర్తిగా వ్యక్తిగత హోదాలోనే వెళ్లానని, పార్టీ ప్రతినిధిగా గానీ, పార్టీ మారాలనే ఉద్దేశంతో గానీ తాను హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా వివిధ సమావేశాలకు హాజరవడం సహజమని, దానిని పార్టీ ఫిరాయింపుగా చిత్రీకరించడం సరికాదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే తాను పార్టీ మారినట్టు బీఆర్‌ఎస్ భావిస్తోందని, కానీ మీడియా కథనాలు చట్టపరమైన ఆధారాలు కాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేవలం ఊహాగానాలు, వార్తా కథనాల ఆధారంగా అనర్హత పిటీషన్‌ను కొనసాగించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకు ఎలాంటి బలమైన ఆధారాలు లేవని, అందువల్ల తనపై దాఖలైన అనర్హత పిటీషన్‌ను కొట్టివేయాలని దానం నాగేందర్ స్పీకర్‌ను కోరారు. ఈ వ్యవహారంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.. రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేసిన తరుణంలో ఆయన అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయనపై అనర్హత పిటిషన్ వేసిన కౌశిక్‌రెడ్డిని కూడా అదే రోజు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలో దానం అఫిడవిట్ పొలిటికల్‌గా కొత్త చర్చకు తెరలేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..