భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే.. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా నామస్మరణతో వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. 9 రోజుల పాటు మంటపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు.. ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. 40 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ రుద్ర మహాగణపతి సాగరం వైపు కదులుతున్నాడు. మధ్యాహ్నం 2గంటలకు ఈ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర.. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి మొత్తం 2.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ట్యాంక్ బండ్‌పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు.
వేలాదిగా బారులు తీరిన గణనాథులను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు నగరవాసులు. భారీగా తరలివచ్చే ప్రజలకు తగ్గట్టుగా ఏర్పాట్లుచేశారు పోలీసులు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అడుగడుగునా బలగాలను మోహరించారు.
మహా గణపతిం భజే. ! గణేష నవరాత్రులు ఇవాళ్టి పరిసమాప్తం అవుతున్నాయి. ఎక్కడికక్కడ నిమజ్జనాలు ఆరంభమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఖైరతాబాద్ గణనాథుడ్ని నిమజ్జనం చేస్తే.. మిగతా విగ్రహాల నిమజ్జనం సులువైపోతుంది. తెల్లవారుజామునే మొదలైన ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది.
హైదరాబాద్‌కే తలమానికమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది. పంచముఖ రుద్రమహాగణపతిని ప్రత్యేక క్రేన్ సాయంతో ట్రాలీమీదకెక్కించారు. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర మొదలైంది.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ లిబర్టీ, హుస్సేన్ సాగర్ వరకూ ఉన్న మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సమీపంలోని బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి: AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు..