Khairatabad Ganesh 2023: గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎటు చూసినా గణేష్ ఉత్సవ శోభే కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు.. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు మరి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నాడు. చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ ఏడాది దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువుకు ఉదయం 9:30 గంటలకు తొలి పూజను గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహిస్తారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు.
హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. దాంతోపాటు.. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహానికి గుడ్ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. ఈ సారి పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు.
గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడిని ఏర్పాటు చేయగా.. ఈసారి ఖైరతాబాద్ గణేషుడిని భారీగా.. 63 ఎత్తులో.. 22 అడుగుల వెడల్పుతో రూపొందించారు. గత సంవత్సరం కంటే 13 అడుగులు ఎక్కువ.. అయితే, ఈసారి పర్యవరణాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితో విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. విగ్రహం బరువు 45-50 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఫ్రేమ్ కోసం ఇప్పటివరకు 22 టన్నుల ఉక్కును ఉపయోగించగా, రాజస్థాన్ నుంచి 40,000 కిలోల మట్టిని తీసుకువచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి 40 కిలోల జ్యూట్ పౌడర్ 1000 బస్తాలు, యాదాద్రి నుంచి వరి పొట్టును సేకరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..