One Rupee Meal: హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?

ప్రస్తుత కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్.. నిరుపేదలకు, నిరాశ్రయులకు అక్షయపాత్రలా మారింది. కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా మంచి భోజనాన్ని అందిస్తూ, ఈ కిచెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలోని వేలాది మంది ఆకలిని తీరుస్తోంది.

One Rupee Meal: హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
Karuna Kitchen In Secunderabad

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 15, 2025 | 1:41 PM

ప్రస్తుత కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్.. నిరుపేదలకు, నిరాశ్రయులకు అక్షయపాత్రలా మారింది. కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా మంచి భోజనాన్ని అందిస్తూ, ఈ కిచెన్ వేలాది మంది ఆకలిని తీరుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ పరిసర ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు, హమాలీలు, రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వృద్ధులు.. ఇలా ఎందరికో ‘కరుణ కిచెన్’ నిత్యం కడుపునిండా భోజనం పెడుతూ అందరి మన్ననలు పొందుతోంది.. ఆకలి లేని సమాజమే కరుణ కిచెన్ లక్ష్యం.. అని ఈ మహత్తర సేవను అందిస్తున్న కరుణ కిచెన్ వ్యవస్థాపకులు రాకేష్ పేర్కొన్నారు. సేవకు ప్రచారం అవసరం లేదని.. తమ లక్ష్యం కేవలం ఒక్కటే – భారతదేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు.. అంటూ పేర్కొన్నారు. ఆకలి అనేది చాలా పెద్ద బాధ. దాన్ని తీర్చడానికి తమ వంతు చేస్తున్న చిన్న ప్రయత్నం అని చెబుతున్నారు. కరుణ కిచెన్ కేవలం రూపాయికే భోజనం అందిస్తున్నప్పటికీ, వంటకాల నాణ్యతలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రతి రోజు మధ్యాహ్నం వేళ రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నారు. మెనూలో అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం ఉంటుంది. కిచెన్‌లోని పరిశుభ్రత, నాణ్యత నిర్వహణ చాలా ఉన్నతంగా ఉంటుందని అక్కడికి వచ్చే భోజనప్రియులు చెబుతున్నారు.

అక్కడ భోజనం చేస్తున్న ఆటోడ్రైవర్లను కదిలిస్తే.. ప్రతి రోజు ఇక్కడే భోజనం చేస్తాం. బయట హోటల్లో కనీసం రూ.50 అవుతుంది. ఆ డబ్బులు మాకు మిగులుతాయి. రూపాయికే ఇంత మంచి భోజనం దొరకడం మా అదృష్టం. ఇది నిజంగా దేవుడిచ్చిన వరం.. అంటూ ఆనందం వెలిబుచ్చుతున్నారు.

నిస్వార్థంగా అందిస్తున్న ఈ సేవకు దాతల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. స్థానిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది సామాన్య ప్రజలు తమకు తోచిన విధంగా కిచెన్‌కు సరుకులు, నగదు రూపంలో సహాయం అందిస్తున్నారు. ఈ సహాయంతోనే ‘కరుణ కిచెన్’ నిరంతరాయంగా తన సేవను కొనసాగిస్తోంది. సికింద్రాబాద్‌లోని ‘కరుణ కిచెన్’ కేవలం ఆకలిని మాత్రమే తీర్చడం లేదు, పేదరికంపై పోరాటంలో మానవత్వం విలువను, దాతృత్వం శక్తిని కూడా చాటి చెబుతోంది. ఈ స్ఫూర్తిదాయకమైన సేవ మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..