Congress: జూబ్లీహిల్స్‌ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ.. సోనియా, రాహుల్‌ని కలిసిన ఆ నేత

గల్లీ టు ఢిల్లీ.. కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్‌ టికెట్ లొల్లి.. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో లాబీయింగ్‌ పెరిగిపోయింది. కొందరు మంత్రులు సీఎం స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటే.. మరికొందరు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. అజారుద్దీన్ అయితే ఏకంగా సోనియా, రాహుల్ గాంధీని కలవడం టాక్‌ ఆఫ్‌ ది గాంధీభవన్‌గా మారింది.

Congress: జూబ్లీహిల్స్‌ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ.. సోనియా, రాహుల్‌ని కలిసిన ఆ నేత
Jubilee Hills Bypoll

Updated on: Aug 13, 2025 | 8:13 PM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది హస్తం పార్టీ. ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇంచార్జిలుగా నియమించింది అధిష్టానం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్‌ను ను ఇంచార్జిలుగా ప్రకటించారు. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా డివిజన్ల వారీగా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు . ఒక ఉప ఎన్నిక గెలుపు కోసం కాంగ్రెస్ ఇంతమందిని మోహరించడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు నేతలు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అజారుద్దీన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. మైనారిటీ కోటాలో టికెట్ కేటాయించాలని వారికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

గతంలో జూబ్లీహిల్స్ టికెట్ తనకే కేటాయిస్తారంటూ కామెంట్ చేసిన అజారుద్దీన్‌పై రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఇష్టం ఉన్నట్టు వారు టికెట్‌ తమకేనంటూ ప్రకటించుకోవద్దన్నారు సీఎం రేవంత్. అప్పటి నుంచి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు అజారుద్దీన్. జూబ్లీహిల్స్‌ టికెట్ ఆశిస్తోన్న అంజన్ కుమార్ యాదవ్‌ సైతం ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. నేషనల్ హెరాల్డ్‌ కేసులో తాను విచారణను ఎదుర్కొన్నానని.. తనకు టికెట్ కేటాయించాలని కోరినట్టు సమాచారం.

మైనారిటీ కోటాకు టికెట్ ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలంటున్నారు ఫిరోజ్‌ ఖాన్. మరోవైపు నవీన్ యాదవ్‌ సైతం టికెట్ కోసం సీఎం రేవంత్‌ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచినవారికి మంత్రి పదవి కూడా దక్కుతుందన్న ప్రచారం జరుగుతుండటంతో టికెట్ కోసం మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం ఎవరికి చాన్స్‌ ఇస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది.