
ఒక ప్రీమియం మద్యం బాటిల్ పగిలిపోవడంతో ప్రయాణికుడికి రూ.500 వోచర్ మాత్రమే ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III గట్టి షాక్ ఇచ్చింది. దెబ్బతిన్న బాటిల్ పూర్తి విలువతో పాటు మానసిక వేదన, కోర్టు ఖర్చులు కలిపి పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. యూసుఫ్‌గూడకు చెందిన వినీత్ 2025 సెప్టెంబర్ 3న ఢిల్లీ నుంచి చెన్నైకి ఇండిగో విమానంలో ప్రయాణించారు. చెక్-ఇన్ చేసే సమయంలో తన సూట్‌కేసులో రూ.35 వేల విలువైన ప్రీమియం వైట్ అండ్ బ్లూ మద్యం బాటిల్ ఉందని, అది అత్యంత సున్నితమైన వస్తువని ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ముందుగానే తెలిపారు.
అయితే చెన్నై చేరుకుని బ్యాగేజీ తీసుకున్న తర్వాత సూట్‌కేసు తెరిచి చూడగా బాటిల్ పూర్తిగా పగిలిపోయింది. మద్యం చిందిపోవడంతో సూట్‌కేసులోని ఇతర వస్తువులు కూడా దెబ్బతిన్నాయి. విమానాశ్రయంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ-మెయిల్ ద్వారా ఇండిగోను సంప్రదించారు. బాటిల్ సరిగా ప్యాక్ చేసిన విషయాన్ని అంగీకరించిన ఇండిగో.. తమ బ్యాగేజీ నిబంధనల ప్రకారం సున్నితమైన వస్తువులను ప్రయాణికులే తమ బాధ్యతపై తీసుకెళ్లాలని పేర్కొంటూ కేవలం రూ.500 విలువైన వోచర్‌ను మాత్రమే ఆఫర్ చేసింది. దీనిపై అసంతృప్తి చెందిన వినీత్ లీగల్ నోటీసు పంపి అనంతరం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణకు ఇండిగో ప్రతినిధులు హాజరుకాలేదు.
కేసును విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III.. చెక్-ఇన్ బ్యాగేజీని నిర్లక్ష్యంగా నిర్వహించినందుకు ఇండిగో సేవల్లో లోపం ఉందని తేల్చింది. దెబ్బతిన్న మద్యం బాటిల్ విలువ రూ.35,000ను 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, అదనంగా మానసిక వేదనకు రూ.15,000, వ్యాజ్య ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి