
హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చే వాటిలో ట్యాంక్‌బండ్ ఒకటి. టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ట్యాంక్‌బండ్ తాజాగా మరింత అందాన్ని సంతరించుకుంది.

పర్యాటకులను ఆకర్షించే క్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ, బుద్ధ పూర్ణిమ అథారిటీ సంయుక్తంగా గత ఆరు నెలలుగా సుందరీకరణ పనులను చేపట్టింది. ఇటీవలే ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో పర్యాటకులు ఈ అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పించారు.

ఇందులో భాగంగానే ప్రతీ ఆదివారం ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీదకి వెళ్లే పర్యాటకుల వాహనాలను కూడా బయటే పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏర్పాట్లు చేసిన మొదటి ఆదివారం (ఆగస్టు 29) రోజున పర్యాటకులు పెద్ద ఎత్తున ట్యాంక్‌బండ్‌పై సందడి చేశారు. కుంటుంబసభ్యులతో సరదగా గడిపారు. చల్లటి సాయంత్రం వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో ట్యాంక్‌బండ్ కొత్త అందాలను కనులారా వీక్షించారు.

రోడ్డుపై వాహనాల గోల లేకపోవడంతో సెల్ఫీలు తీసుకుంటూ, రోడ్ల పక్కన పెట్టిన స్ట్రీట్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ట్రాఫిక్ కారణంగా ట్యాంక్‌బండ్‌పై అందాలను వీక్షించలేకపోతున్నామని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆదివారం ట్రాఫిక్ మళ్లింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని పోలీస్ కమిషనర్‌కు ట్వీట్ చేయడం, పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు ప్రకటన చేయడం చకచకా జరిగిపోయింది.