Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌లో మంజీరా ఫేజ్-3 వ్యవస్థలో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. పెద్దాపూర్ పంప్ హౌస్‌లో పాత హెచ్‌టీక్ ప్యానెల్స్ మార్పిడి, పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు అందనుంది.

Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply Interruption

Edited By:

Updated on: Mar 06, 2026 | 9:17 PM

హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్–3 వ్యవస్థలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు వాటర్ బోర్డు తెలిపింది. పెద్దాపూర్ పంప్‌లోని పంప్ హౌస్‌లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హై టెన్షన్ (HT) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిల్లీమీటర్ల వ్యాసం గల పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, అలాగే సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిల్లీమీటర్ల గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను కూడా మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులను ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగిస్తారు. మొత్తం 36 గంటలపాటు నిర్వహించే ఈ పనుల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా తక్కువ ఒత్తిడితో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోనుంది.

షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందని, భోజగుట్ట ప్రాంతంలో మాత్రం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మణికొండ, కోకాపేట్, నర్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ట్రాన్స్‌మిషన్–1, ట్రాన్స్‌మిషన్–2 పరిధిలో కూడా సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని ముందుగానే నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సూచించింది.

Also Read: వేసవి బీరకాయ పంటలో దిగుబడి పెరగాలంటే ఇలా చేయండి.. 

Follow Us