AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుషాయిగూడలో దారుణం.. వేగంగా వచ్చి ఏడుగురిని ఢీకొట్టిన కారు! టెకీ అరెస్ట్

హైదరాబాద్‌ కుషాయిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈసీఐఎల్‌లో న్యూ చైతన్య కాలేజ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను పోలీసులు సీసీటీవీ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

కుషాయిగూడలో దారుణం.. వేగంగా వచ్చి ఏడుగురిని ఢీకొట్టిన కారు! టెకీ అరెస్ట్
Kushaiguda Car Accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 01, 2026 | 4:21 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 10: కుషాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈసీఐఎల్‌లోని న్యూ చైతన్య కాలేజ్ సమీపంలో దేవి మొబైల్ షాప్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం..

AP 10 AU 1232 నంబర్ గల కారు వెనుక నుంచి వేగంగా వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కొందరు రోడ్డుపై ఎగిరిపడినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అజయ్ కుమార్, బిపిన్ కుమార్ యాదవ్, రాకేష్ యాదవ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను తొలుత శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సూర్యా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

దర్యాప్తులో పవన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కారును నడిపినట్లు పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రమాద సమయంలో పవన్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతనితో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు తెలిసింది. కాగా.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా పాదచారులను ఢీకొట్టిన దృశ్యాలు అందులో కనిపించడంతో ఈ వీడియో చూసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us