కంత్రీగాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కూడా వదలడం లేదు. ఆర్టీసీ బస్సులను, రైళ్లను కూడా తమ అక్రమ కార్యకలాపాలకు యధేచ్చగా వినియోగించుకుంటున్నారు. పోలీసులు అంటే కనీసం భయం లేకుండా పోయింది. ఇంతలా తనిఖీలు జరుగుతున్నా కూడా తమను ఆపేవాడే లేడు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15.5 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చాంద్ కుమార్ నాయక్ (30)గా గుర్తించారు. అతడిని అక్కడికక్కడే అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోమవారం ఉదయం ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఒడిశాలోని మోహనా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయిని తరలిస్తుండగా నాయక్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. నిషిద్ధ వస్తువులు ఉన్న రెండు ట్రాలీ సూట్‌కేసులు, మూడు షోల్డర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చిదాతో పాటు మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ షేక్ సలీమా, ఆమె డిప్యూటీ ఎస్ఎన్ జావేద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. సికింద్రాబాద్ జీఆర్‌పీ అధికారులు, సిబ్బంది కృషికి రైల్వే అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్ అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: చనిపోయి కనిపించిన కొండచిలువ.. శవపరీక్షలో పొట్ట కోయగా.. వామ్మో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..