Khairtabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి వరల్డ్ ఫేమస్.. అసలు ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలుసా..?

|

Sep 27, 2023 | 9:28 PM

Hyderabad: 2019లో 61 అడుగుల ఎత్తున్న గణేషుడిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుల కెక్కింది ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహం. అయితే హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడిని ఏర్పాటు..

Khairtabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి వరల్డ్ ఫేమస్.. అసలు ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలుసా..?
Khairtabad Ganesh
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్ 27: భాగ్యనగరంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్‌ మహాగణపతే. నగరంలో వీధివీధినా లక్షల విగ్రహాలు ఏర్పాటు చేసినా కూడా ఖైరతాబాద్‌ గణపతికి ఉన్న ఆకర్షణ వేరు. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఖైరతాబాద్‌లోని ఆలయంలో ఒక అడుగు ఎత్తు ఉన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు.

2019లో 61 అడుగుల ఎత్తున్న గణేషుడిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుల కెక్కింది ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహం. అయితే హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌ విగ్రహానికి గుడ్‌ బై చెప్పి.. మట్టి గణపయ్య విగ్రహానికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ఈ సారి పూర్తిగా మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పారు. ఎత్తులోనే కాదు, బరువులో కూడా 50 టన్నులతో గణనాథుడు రికార్డు సృష్టించాడు.

ఇక శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకునేందుకు ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌ మహా నగరంలో అన్ని దారులు ఖైరతాబాద్‌ వైపే మళ్లాయి. శనివారం రెండు లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్‌ మహా గణేషుడ్ని దర్శించుకున్నారు. ఆ రికార్డ్‌ కూడా ఆదివారం బద్ధలైంది. ఆదివారం ఒక్క రోజే 3 లక్షల మందికి పైగా భక్తులు ఆ భారీ గణనాథుడిని దర్శించి తన్మయత్వం చెందారు.

ఖైరతాబాద్‌లో భారీ గణనాథుడి కోసం ఏటా అంతే స్థాయిలో భారీ లడ్డూను కూడా తయారు చేయిస్తారు నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం గతంలో లడ్డూను తీసుకొచ్చేవారు. ఆ లడ్డూ పలుమార్లు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకుంది. అయితే కొన్నేళ్లుగా ఆ సంప్రదాయానికి బ్రేక్‌ పడింది. భారీ లంబోదరుడి స్థానికంగానే భారీ లడ్డూను తయారు చేయిస్తున్నారు. అదే క్రమంలో ఈ సారి నగరంలోని లంగర్‌ హౌస్‌కు చెందిన వ్యాపార వేత్త 2,200 కిలోల భారీ లడ్డూను ఖైరతాబాద్‌ మహాగణపతికి సమర్పించారు.