Ind vs Aus 3rd T20I: HCA ఓవరాక్షన్ HRCకి చేరింది. క్రికెట్ ఫ్యాన్స్ ఆశలను గల్లంతు చేస్తూ.. నిర్వాహకులు టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు. పక్కా జూద సంస్థగా మారిందంటూ న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 25న ఇండియా- ఆస్ర్టేలియా టీ 20 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది. నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక హైదరాబాద్‌లో క్రికెట్ అంటేనే ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతోంది. కేవలం టికెట్ దొరికితే చాలు.. ఎంతైనా పెట్టేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఒక్కోసారి 10వేల రూపాయలు పెట్టి బ్లాక్‌లో టికెట్ కొని కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్తుంటారు. అలాంటిది.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనే సరికి ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఎలాగైనా చూడాలని టెకెట్స్ కోసం చేసిన ప్రయత్నాలు షాక్ కొడుతున్నాయి. 55వేల మంది సిట్టింగ్ కెపాసిటీతో ఉన్న ఉప్పల్ స్టేడియం టికెట్స్ మొత్తం అమ్ముడు పోయాయి. హౌస్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఏజెన్సీతో నిర్వాహకులు కుమ్మక్కై టికెట్స్‌ను అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కాగా, కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న ఉప్పల్‌లో జరగనున్న ఇండియా – ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీం హెచ్చార్సీని ఆశ్రయించారు. క్రీడా అభిమానులను మోసం చేస్తూ.. అక్రమంగా టికెట్లను బ్లాక్‌లో HCA విక్రయిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, టికెట్ల విక్రయ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను న్యాయవాది కోరారు.