శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఎవరెస్ట్ మౌంటనీర్ తుకారాంకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తుకారాం తల్లి దండ్రులను చూసి భావోగ్వేదానికి గురైయ్యారు. ఎవరెస్టు నుంచి తిరిగి వస్తానని అనుకోలేదని, తిరిగి బేస్ క్యాంపునకు ఎలా వచ్చానో ఇప్పటికీ తెలీదని తుకారాం వివరించారు.
ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్‌కు చెందిన మాజీ క్యాడెట్ అంగోత్ తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. దక్షిణకోల్ రూటులో నేపాల్‌వైపుగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గతంలోనూ అనేక పర్వతాలను అధిరోహించిన అనుభవం తుకారాంకు ఉంది. సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ రెండో బెటాలియన్‌లో క్యాడెట్‌గా చేసిన తుకారాం, గతంలో ఉత్తరకాశీలో పర్వతారోహణ కోర్సులో పాల్గొన్నారు. 2017లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. పర్వతాల అధిరోహణలో పలు రికార్డులు సాధించిన తుకారాం 2018లో ఉత్తమ క్రీడాకారుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెల్చుకున్నారు. తమ మాజీ క్యాడెట్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండటంపై ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ సంతోషం వ్యక్తం చేసింది.