
మేడమ్ మహా స్ట్రిక్ట్.. ఒక్క రూపాయ్ లంచం తీసుకోరు.. నీతి, నిజాయితీకి నిలువుటద్దం మా మేడమ్..! ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో ఇలాంటి బిల్డప్పే ఉంటుంది. నిజమే.. ఏ మేడమూ లేదా ఏ సారూ నేరుగా రూపాయ్ ముట్టుకోరు.. “పేటీఎం కరో” టైప్‌లో తెరవెనుక కథ నడిపిస్తారు..! తాజాగా అలాంటి ఓ అవినీతి మేడమ్ గారికి చెక్ పెట్టారు అవినీతి నిరోధక బ్యూరో అధికారులు. మిషన్ భగీరథ (INTRA)లో పనిచేస్తున్న లేడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను రూ.10,000 లంచం డిమాండ్ చేసినందుకు అరెస్టు చేశారు. నిందితురాలైన అధికారిణి కూనమల్ల సంధ్యా రాణి జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నారు. మిషన్ భగీరథ కింద ఫిర్యాదుదారుడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పనులను తనిఖీ చేసి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు రిపోర్ట్ ఇవ్వడం ఆమె విధి. అయితే అందుకు చేయి తడవాల్సిందే అని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆమె ప్రైవేట్ అసిస్టెంట్ మహేందర్ యుపిఐ ఖాతా ద్వారా లంచం తీసుకోగా.. అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. అధికారిక పని కోసం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ACB ప్రజలను కోరింది.
బాధితులు ACBని టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా వారి వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. Facebook (Telangana ACB).. X (@TelanganaACB) ద్వారా సంప్రదించవచ్చు. లేదా 9440446106కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..